హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయ క్రాం తి): పెండింగ్ క్రిమినల్ కేసులున్నాయనే కారణంతోనే కేంద్ర విదేశాంగశాఖ పాస్‌పోర్ట్ జారీకి నిరాకరించొద్దని హైకోర్టు మరో సారి స్పష్టం చేసింది. కోర్టులో కేసు పెండింగ్ ఉందన్న కారణంతో తనకు పాస్‌పోర్ట్ రాలేదని హైదరాబాద్‌వాసి ఎన్.పూర్ణచంద్రారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, శుక్రవారం పిటిషన్‌ను జస్టిస్ మౌసమీ భట్టాచా ర్య విచారించారు.
పాస్‌పోర్ట్ రెన్యూవల్, లేదా తిరిగి మంజూరుకు క్రిమినల్ కేసులు అడ్డుకాకూడదని ఇప్పటికే సుప్రీంకోర్టు వెంగల కస్తూరి రంగాచార్యులు వర్సెస్ సీబీ ఐ కేసులో స్పష్టం చేసిందని, ఆ తీర్పు ఆధారంగా హైకోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తుచేశారు.
కేసు విచారణకు సహకరిస్తానని, విచారణ పూర్తయ్యే వరకు కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లనంటూ పిటిషనర్ పూర్ణచంద్రారెడ్డి ఖమ్మం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించిచారు. అఫిడవిట్ సర్టిఫైడ్ కాపీని కోర్టు నుంచి తీసుకుని పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. వాటిని పరిశీలించి, పూర్ణచంద్రారెడ్డికి పాస్‌పోర్ట్ జారీ చేయాలని ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారికి ఆదేశాలు జారీ చేశారు.