calender_icon.png 24 October, 2024 | 7:58 PM

ఆ విల్లాలను కూల్చొద్దు

12-09-2024 12:30:53 AM

మేడ్చల్ అధికారులకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గండి మైసమ్మ దుండిగల్ మండలం మల్లంపేట గ్రామ సర్వే నంబర్ 170/4లోని విల్లాలను కూల్చరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు లు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్, దుండిగల్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్, జిల్లా నీటిపారుదల విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. అప్పటి వరకు కూల్చివేత చర్యలు తీసుకోరాదని జస్టిస్ కే లక్ష్మణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో గండిమైసమ్మ తహసీల్దార్, దుండిగల్ మున్సిపల్ కమిషనర్, టాస్క్ టీమ్‌లను ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌ను ఆదేశించింది.

మొత్తం 90 విల్లాల్లో 15 విల్లాలను ఈ నెల 8న ఉదయం ఆరు గంటలకు కూల్చివేయడంతో మిగిలిన వాటిని కూల్చకుండా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ నిజాంపేటకు చెందిన లక్ష్మీ శ్రీనివా స కన్‌స్ట్రక్షన్స్ పార్టనర్ కస్తూరి భాయ్ హైకోర్టును ఆశ్రయించారు. విల్లాలను లబ్ధిదారుల కు కేటాయింపు జరిగిన విషయాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని, గ్రామ పంచాయతీ నుంచి 2018 జూలై 27న 90 విల్లాల నిర్మాణాలకు చట్ట ప్రకారం అనుమతులు పొందామని పిటిషనర్ వాదించారు. దీనిపై పూర్తి వివరాలు సమర్పించేందుకు గడువు కావాలని ప్రభుత్వం కోరింది. ఇందుకు అనుమతిచ్చిన హైకోర్టు విచారణను వాయిదా వేసింది.