కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
ముషీరాబాద్, అక్టోబర్ 26: మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను కూల్చొద్దని కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి ప్రభుత్వానికి హితవు పలికారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ముషీరాబాద్ డివిజన్ కార్పొరేటర్ సుప్రియానవీన్ గౌడ్‌తో కలిసి శనివారం ముషీరాబాద్ నియోజకవర్గంలో రూ.1.35 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో అభివృద్ధి చెందుతున్న నగరాలలో హైదరాబాద్ ఒకటని, కానీ నగర ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు. అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ వ్యవస్థ, అధ్వానపు రోడ్లు, పలు ప్రాంతాల్లో గత నాలుగు నెలలుగా వీధి దీపాలు వెలగకపోవడం తదితర సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వాల వైఫల్యాల వల్లే ప్రజలు సమస్యలతో అవస్థలు పడుతున్నారని అన్నారు. జీహెచ్‌ఎంఎసీ కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం, కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడం వల్ల సమస్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు. నగర అభివృద్ధికి హైలెవల్ మీటింగ్ ఏర్పాటు చేసి నిధులు విడుదల చేయాలని అన్నారు.
కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ డీఎంసీ ఖాదిర్, డీఈలు సన్నీ, గీత, ఏఈ అనూష, బీజేపీ ముషీరాబాద్ నియోజకవర్గ కన్వీనర్ ఎం రమేష్‌రామ్, జాయింట్ కన్వీనర్ ఎం నవీన్ గౌడ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ సభ్యుడు పూస రాజు, సీకే శంకర్, బీఆర్‌ఎస్ నాయకుడు ముఠా జైసింహ, ముచ్చకుర్తి ప్రభాకర్, మాధవ్ తదితరులు పాల్గొన్నారు.