calender_icon.png 23 November, 2024 | 6:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫుడ్ ఇమేజ్‌కు డ్యామేజీ జరగొద్దు

23-11-2024 01:04:51 AM

  1. ఆహార కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు  
  2. మందుల సమాచారమంతా ఆన్‌లైన్‌లో  
  3. మంత్రి దామోదర్ రాజనర్సింహ

హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): ఫుడ్ సేఫ్టీలో హైదరాబాద్ దేశంలోనే చిట్టచివరన ఉందంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారంపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారంపై అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. హైదరాబాదీ ఫుడ్ ఇమేజ్‌కు డ్యామేజీ జరగకుండా చూడాలని ఫుడ్ సేఫ్టీ అధికారులకు సూచించారు.

ఆహార కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శుక్రవారం సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 4,366 హోటళ్లు, హాస్టళ్లు, స్ట్రీట్‌ఫుడ్ స్టాల్స్‌ను అధికారులు తనిఖీ చేసి 566 సంస్థలపై కేసులు నమోదు చేయడంతో పాటు రూ.66 లక్షల జరిమానా విధించామని మంత్రికి అధికారులు తెలిపారు.

ప్రజలకు నాణ్యమైన ఫుడ్ అందేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు అనుగుణంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లను నియమిస్తున్నామన్నారు. నాచారం ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌ను ఆధునీకరించడంతో పాటు, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో  కొత్తగా మరో మూడు ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్‌ను మంజూరు చేశామని తెలిపారు.

కొత్తగా 5 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ నెల రోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఫుడ్ సేఫ్టీ ఫిర్యాదుల కోసం కలెక్టరేట్లలో స్పెషల్ సెల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఆన్‌లైన్‌లో నమోదు..

ప్రభుత్వ దవాఖానల కోసం కొనుగోలు చేసే మెడిసిన్ ఇండెంట్ దగ్గర్నుంచి పేషెంట్‌కు చేరే వరకూ పూర్తి సమాచారం ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులకు మంత్రి రాజనర్సింహ సూచించారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న 22 సెంట్రల్ మెడిసిన్ స్టోర్ల పనులను వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. స్టోర్ల ఏర్పాటుతో ప్రతి జిల్లాకు ఒక సీఎంఎస్ అందుబాటులోకి వస్తున్నదని అధికారులు మంత్రికి వివరించారు.

ఔషధాల సరఫరాలో అక్రమాలపై టాస్క్‌ఫోర్స్ అందించిన నివేదికపై చర్చించారు. మెడిసిన్ సప్లు చెయిన్ మేనేజ్‌మెంట్‌ను మూడు దశలుగా విభజించి, ప్రతి దశకు ఒకరిని బాధ్యులుగా నియమించాలని సూచించారు. జిల్లాల్లో మెడిసిన్ సప్లు మేనేజ్‌మెంట్‌కు డిప్యుటీ డీఎంహెచ్‌వోలను ఇన్‌ఛార్జిలుగా నియమించాలని ఆదేశించారు. హెల్త్ సెక్రటరీ క్రిస్టినా పాల్గొన్నారు.