calender_icon.png 28 October, 2024 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ బ్రాండ్‌ను దెబ్బతీయొద్దు

12-08-2024 12:17:43 AM

  1. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు సరికాదు
  2. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేయవద్దని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని మాట్లాడటం సరికాదన్నారు. ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండకపోతే రాష్ట్రం నుంచి వెళ్లిపోతామని అమరరాజా సంస్థ చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోందని, అది నిజమైతే చాలా దురదృష్టకరమ న్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ వైఖరేంటో అర్థంకాక చాలా సంస్థలు రాష్ట్రాన్ని వీడుతున్నాయని, కేన్స్ టెక్నాలజీ గుజరాత్‌కు వెళ్లిపోయిందన్నారు. కార్నింగ్ తమ ప్లాంట్‌ను చెన్నైకి తరలించిందని, తాజాగా అమరరాజా కూడా వెళ్లిపోతానని పేర్కొంటుడం వల్ల తెలంగాణ బ్రాండ్‌కు తీవ్రనష్టం జరుగుతుందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టడం మంచిది కాదని, ప్రభుత్వ పాలసీలు పెట్టుబడులను ఆకర్షించేందుకు అనుగుణంగా ఉండాలని సూచించారు.

అమరరాజా సంస్థ తెలంగాణలో రూ.9,500 కోట్ల పెట్టుబడులు పెట్టేలా ఒప్పించేందుకు ఎంతో కష్టపడ్డామని, రాష్ట్రానికి తెచ్చేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. నిజానికి తెలంగాణ దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయంతో రెవెన్యూ సర్ ప్లేస్ స్టేట్‌గా ఉందని, దివాళా తీసిందంటూ ఎయిడ్స్, క్యాన్సర్ రోగులని ప్రచారం చేస్తుండటం ఆవేదన కలిగిస్తోం దన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని అమరరాజా సంస్థ ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా చర్యలు చేపట్టాలని కోరారు. నిర్లక్ష్యం చేస్తే మిగతా సంస్థలు కూడా రాష్ట్రాన్ని వదిలే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. 

సుశాన్ మరణం బాధ కలిగించింది 

యూట్యూబ్ మాజీ సీఈఓ సుశాన్ వొజ్కికి మరణవార్త చాలా బాధ కలిగించిందని కేటీఆర్ తెలిపారు. అత్యంత డైనిమిక్‌గా ఉండే వొజ్కికి ఎంతో తెలివైన వారని, పలు సందర్భాల్లో ఆమె మాటల ద్వారా చాలా నేర్చుకున్నానని పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వొజ్కికి కుటుంబసభ్యులకు, స్నేహితులకు కేటీఆర్ సంతాపం తెలిపారు.