16-04-2025 01:48:29 AM
పార్టీలో ఉంటూ ఇష్టంవచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు
హైదరాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. పార్టీ లైన్ దాటి ఎవరైనా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. పార్టీలో ఉంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లా డి ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తే సహించేది లేదని, ఇలాంటి వ్యాఖ్యలతో లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుందని, ఆ తర్వాత నేతలే ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు.
మంత్రివర్గ విస్తరణపై పార్టీ అధి ష్ఠానం నిర్ణయమే ఫైనల్ అని, ఈ విషయంలో ఎవరేమి మాట్లాడినా ఉపయోగం లేదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మంత్రి పదవులపై ఒకరికి మించి ఒకరు లీక్‌లు ఇస్తున్నారని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మంత్రి పదవులు రావన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పనిచేసుకోవాలని సూచించారు.
సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం శంషాబాద్ నోవాటెల్ హోటల్‌లో జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో మంత్రు లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో భూభారతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై ప్రధానంగా చర్చించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..ఎవరెవరూ ఏమి మాట్లాడుతున్నారనేది అంతా రి కార్డు అవుతూనే ఉందని ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఒక్క ఎమ్మెల్యే కూడా సోషల్ మీడియాను వాడటం లేదని మండిపడ్డారు. ప్రభుత్వంపై విపక్షాలు నెగిటివ్ ప్రచారం చేస్తుంటే.. ఎమ్మెల్యేలు ఏమి చేస్తున్నారని సీఎం ప్రశ్నించారు.
కొందరు ఎమ్మెల్యేలు వారి, వారి నియోజకవర్గాలు వదిలి హైదరాబాద్‌కే పరిమితం అవుతున్నారని, వారానికోసారి నియోజకవర్గాలకు వెళ్లివస్తూ వీకెండ్ రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు. పార్టీని బ్లాక్ మెయిల్ చేస్తామంటే కుదరదని, భయపడే పరిస్థితుల్లో పార్టీ లేదన్నారు.
భూభారతిని ప్రజలకు చేరువ చేయాలి..
ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ సూచించారు. ‘ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని పలు సమస్యలకు మన ప్రభు త్వం శాశ్వత పరిష్కారం చూపింది. మనం తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉంది. సన్నబియ్యం పథకం ఒక అద్భుతం.
ఆనాడు రూ.2 కిలోబియ్యం పంపిణీతో ప్రజల నుంచి ఎంత ఆదరణ వచ్చిందో.. ఇప్పుడు సన్నబియ్యం పథకం కూడా శాశ్వతంగా గుర్తుండే పథకం.. ఇది మన పేటెంట్ పథకం. భూభారతిని రైతులకు చేరువ చేయాలి. దేశంలోనే ఇందిరమ్మ ఇండ్ల పథకం ఆదర్శంగా నిలిచింది.
దీన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలి.. నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు అందాలి. విద్యా, ఉద్యోగ రాజకీయాల్లో బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బిల్లులు తీసుకొచ్చాం. ఇది మన పారదర్శక పాలనకు నిదర్శనం. జఠిలమైన ఎస్సీ ఉపకులాల వర్గీకరణ సమస్యకు శాశ్వత పరి ష్కారం చూపాం.
అందుకే వర్గీకరణ జరిగే వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు’ అని సీఎం వివరించారు. రైతు రుణమాఫీ, సన్న వరికి రూ.500 బోనస్, 200 యూ నిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సబ్సిడీ తదితర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
నేటినుంచి జూన్ 2 వరకు ప్రజలతో మమేకం కావాలి..
పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులందరూ బుధవారం నుంచి జూన్ 2వ తేదీ వరకు ప్రజల్లోకి వెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. తా ను కూడా మే 1వ తేదీ నుంచి జూన్ 2 వర కు ప్రజలతో మమేకం కావడానికి సమయం కేటాయిస్తానని చెప్పారు. ‘హెచ్‌సీయూ భూములపై ప్రతిపక్షం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఒక అబద్ధం ప్రచారం చేసింది. బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి ప్రజాప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నాయి.
పార్టీ, ప్రభుత్వం ప్రతిష్ట పెరిగితే భవిష్యత్ ఉంటుంది. మనం ఎంత మంచిపని చేసినా ప్రజల్లోకి వెళ్లకపోతే ప్రయోజనం ఉండదు. మళ్లీ గెలవాలంటే ఇప్పటినుంచే ప్రజల్లోకి వెళ్లాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మీ నియోజక వర్గంలో ఏమి కావాలో ఒక నివేదిక తయారు చేసుకోండి. ఆ పనులను పూర్తిచేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుం ది. ’ అని సీఎం పేర్కొన్నారు.
తెలంగాణపై మోదీ రంగంలోకి దిగారు..
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ప్రధాని నరేంద్రమోదీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నా రు. నిన్న, మొన్నటి వరకు కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ విమర్శలు చేసేవారని, ఇప్పుడు ఏకంగా ప్రధానమంత్రి నరేం ద్రమోదీనే రంగంలోకి దిగారని సీఎం పేర్కొన్నారు.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మోదీకి గుదిబండగా మారిందని, కులగణన మోదీకి రాజకీయంగా మరణశాసనం రాయబోతుందని అన్నారు. తెలంగాణ మాడల్‌పై దేశంలో చర్చ జరుగుతోందని, అందుకే తెలంగాణ లో కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టాలని బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ఒక్కటయ్యాయని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్నబి య్యం ఎందుకు ఇవ్వడంలేదో ఆ పార్టీ నేత లు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీకి రూ.25వేలు ఇవ్వాలి..
సీఎల్పీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అభివృద్ధికి ప్రతీ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేతనం నుంచి ప్రతి నెల రూ.25 వేలు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. అద్దంకి దయాకర్‌లాగా అందరూ ఓపికతో ఉండాలని, ఆయన ఓపికగా ఉన్నా డు కాబట్టే ఎమ్మెల్సీ అయ్యాడని సీఎం పేర్కొన్నారు. అద్దంకి దయాకర్ తన జీతం లో 10 శాతం ఏఐసీసీకి, 15 శాతం పీసీసీకి ఇస్తున్నారని సీఎం వెల్లడించారు. ఎమ్మెల్యేలు తమ జీతం నుంచి పార్టీకి రూ.10 వే లు, సీఎల్పీకి రూ.10వేలు ఇవ్వాలని పీసీసీ నిర్ణయం తీసుకున్నది.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్
ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సూ చించారు. సన్నబియ్యం పంపిణీ, భూభారతి, ఎస్సీ వర్గీకరణ, ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నవడ్లకు రూ. 500 బోనస్‌తో పాటు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ. 500లకు గ్యా స్ సిలిండర్ తదితర పథకాలపై ప్రజల్లో ప్ర చారం చేయాలన్నారు. జూన్ 2వ తేదీ వరకు జనంలోనే ఉండాలన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగినా ప్రజాప్రభుత్వం వాటిని సరిచేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.
‘కంచ’ భూములపై మోదీకి సరైన సమాచారం లేదు.. : మంత్రి శ్రీధర్‌బాబు
ప్రధాని నరేంద్రమోదీ అంటే తమకు గౌరవం ఉందని, కానీ కంచ గచ్చిబౌలి భూ ములపై రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు, ఆ పార్టీ నాయకులు సరైన విధంగా సమాచారం ఇవ్వలేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ప్రధాని మోదీ అలా మాట్లాడుతారని అనుకోలేదని, గచ్చిబౌలి భూములు ప్రభుత్వ భూములని సుప్రీంకోర్టే తీర్పు ఇచ్చిందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చాలా అటవీ భూములను నేలమట్టం చేసి బిల్డింగ్‌లు కట్టారన్నారు.
మన పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు : డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధితో ప్రజలు సంతోషంగా ఉన్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. సంక్షేమంతో పాటు ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన పకడ్బందీగా పూర్తి చేశామన్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనను పెద్ద పెద్ద నాయకులే చేయలేకపోయారని, మన ప్రభుత్వం ధైర్యంగా అందరికీ చెప్పి చేసిందని భట్టి వివరించారు. వీటి ఫలితాలను కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూ చించారు. కంచ గచ్చిబౌలిలో ఏనుగులు, పులులు తిరుగుతున్నట్లు బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయో గించి కుట్రలు చేస్తున్నాయన్నారు.
సీఎంకు తప్పిన ప్రమాదం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్ర మాదం తప్పింది. నోవాటెల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఎక్కిన లిప్టులో స్వ ల్ప అంతరాయం ఏర్పడింది. లిప్టు లో 8 మంది ఎక్కాల్సి ఉండగా, ఏక ంగా 13 మంది ఎక్కారు. ఓవర్‌వెయి ట్ కారణంగా ఆ లిప్టు మొరాయించింది. ఎక్కు వ మంది ఎక్కడంతో లిప్టు కిందికి దిగింది. దీంతో ఒక్కసారిగా అధికారులు టెన్షన్ పడ్డారు. అటు హోటల్ సిబ్బంది, అధికారులు అప్రమత్తమయ్యారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో పార్టీ నేతలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.