calender_icon.png 27 December, 2024 | 3:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్రాల్లో కొనరు.. మిల్లర్లు వదలరు!

03-11-2024 12:45:56 AM

  1. కల్లాల్లోకే వెళ్లి రైస్ మిల్లర్ల ధాన్యం కొనుగోళ్లు 
  2. ఇప్పటికే 50 వేల మెట్రిక్ టన్నుల సేకరణ
  3.  చోద్యం చూస్తున్న అధికారగణం 

కరీంనగర్, నవంబర్ 2 (విజయక్రాంతి): రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామని ఓ వైపు ప్రభుత్వం ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరోలా ఉన్నా యి. కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ౧౫ రోజులు కావస్తు న్నా నేటికీ రైతుల నుంచి క్వింటాల్ ధాన్యం కొనలేదు.

సీఎంఆర్ సన్నబియ్యం కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన జీవో నంబర్ 27పై మిల్లర్లు ఆగ్రహంతో ఉన్నారు. కొనుగోళ్లపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో ఇప్పటివరకు కొనుగోళ్లకు ముందుకు రావట్లేదు.

అటు అలక నటిస్తూనే, మరోవైపు దొడ్డి దారి న క్వింటాల్‌కు రూ.2 వేలు, అంతకన్నా తక్కు వ ధరకే రైతుల నుంచి ప్రైవేట్‌గా కొనుగోలు చేస్తున్నారు. సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించగా, బోనస్ సంగతి అటుఇంచితే కనీసం మద్దతు ధర కూడా అందని పరిస్థితి నెలకొంది. 

విధిలేక అమ్మకాలు

రోడ్లపై, కల్లాల వద్ద ధాన్యాన్ని నిల్వ ఉంచుకోలేక విధిలేని పరిస్థితుల్లో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. మిల్లర్లు ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ధాన్యాన్ని తరలించుకుపోతున్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్ 27నే ఈ పరిస్థితికి కారణమైందని పలువురు పేర్కొంటున్నారు.

ఇప్పటివరకు సీఎంఆర్ బకాయిలు లేని రైస్‌మిల్లర్లు 10 శాతం బ్యాంకు గ్యారెంటీ లేదా 25 శాతం సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలని, బకాయిలను ఫెనాల్టీతో చెల్లించినవారు 20 శాతం బ్యాంకు గ్యారెంటీ లేదా, 25 శాతం సెక్యూరిటీ డిపాజిట్ ఇవ్వాలని నిబంధనలు విధించింది. ధాన్యం క్వింటాల్‌కు రూ.30, సన్నాలకు రూ.40 మిల్లింగ్ చార్జీలు పెంచుతున్నట్టు చెప్పిన ప్రభుత్వం..

అందులోనూ కొర్రీలు పెట్టడంతో మిల్లర్లు ఈ జీవోను వ్యతిరేకిస్తున్నారు. కొనుగోలుకు ముందుకు రాకపోవడంతో కేంద్రాల వద్ద ధాన్యం నిల్వలు పెరిగిపోతున్నాయి. కరీంనగర్ జిల్లావ్యాప్తంగా 384 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేశారు. 

వానతో రైతుల్లో భయం 

కేంద్రాల్లో కొనుగోళ్లు లేక రైతుల కల్లాల వద్ద ధాన్యం కుప్పలు పేరుకుపోయాయి. రెండు రోజుల నుంచి జిల్లాలో అక్కడక్కడ వాన పడుతుండ టంతో ధాన్యం తడిసిపోతుందనే భయంలో రైతులు ఉన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద సరైన కార్పెట్లు లేకపోవడంతో కొన్నిచోట్ల రైతులే కవర్లు తీసుకువచ్చి తడవకుండా కాపలా కాస్తున్నారు. 

సౌకర్యాలు కల్పించలేదు 

పది రోజుల క్రితం ఐకేసీ సెంటర్‌కు ధాన్యం తీసుకొచ్చిన. మబ్బు వస్తుందని తాటిపత్రులు కప్పినాం. మహాత్మానగర్ ఐకేపీ సెంటర్‌లో సౌకర్యాలు కల్పించలేదు. వడ్లు పూర్తిగా ఎండకుఎండితే రూ.2,200, తేమశాతం ఎక్కువగా ఉంటే రూ.1,900 ఇస్తున్నారు. ఇప్పటికైనా మద్దతు ధరతో కొనుగోళ్లు చేపట్టాలి. 

 నరసయ్య, రైతు, తిమ్మాపూర్

పట్టింపులేనట్టు ఇన్‌చార్జి మంత్రి తీరు.. 

ధాన్యం కొనుగోళ్లపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పట్టింపులేనట్టు వ్యవహ రిస్తున్నారు. కేంద్రాల్లో ధాన్యం కుప్పలు పేరుకుపోతున్నాయి. వర్షం భయంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభు త్వం చొరవ చూపకుంటే ఆందోళన తప్పదు. 

 బండ గోపాల్‌రెడ్డి, 

రైతు సంఘం నాయకుడు