08-04-2025 12:51:22 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్7 (విజయక్రాం తి): కొంతమంది వీసీలు, అధికారుల కుట్రతో ఏకపక్షంగా తీసుకొచ్చిన 21జీవోతో తమ పొట్ట కొట్టొద్ద ని తెలంగాణ యూనివర్సిటీల కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. తమను రెగ్యులర్ చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా ఉన్నారని, కానీ ఆయనను కొంతమంది కావాలనే పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు.
సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో యూనియన్ నాయకుడు వేల్పుల కుమార్ అధ్యక్షతన నిర్వహించిన మీడియా సమావేశంలో నాయకులు డా. ధర్మ తేజ, డా.పరశురాం, డా.ఉపేందర్‌రావు, డా.వెంకటే శం, డా.మాదాసి కనకయ్య, డా. అస్లేశ తదితరులు మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ యూనివర్సిటీల్లో 80 శాతం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లే ఉన్నారని చెప్పారు.
గత ప్రభుత్వంలో పదవులను అనుభవించిన కొంత మంది ప్రస్తుత ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించి ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయ త్నం చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో తమను రెగ్యులర్ చేసేందుకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా పూర్తి చేశారన్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మణిపూర్‌లో చేసినట్లుగా, ఉమాదేవి వర్సెస్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తమనూ రెగ్యులర్ చేయాలని కోరారు.
బేసిక్ డిఏ, హెచ్‌ఆర్‌ఏ, మూడు శాతం ఇంక్రిమెంట్తో కూడిన పే స్కేల్‌ను అమలు చేయాలని కోరారు. 15 ఏండ్లుగా తమ ప్రతిభను యూనివర్సిటీల అభ్యున్నతికే ఉపయోగిస్తున్నా మని, యూజీసీ, నెట్, సెట్, సహా అన్ని అర్హతలున్న 1270మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు మధ్యంతరంగా ఎక్కడికి వెళ్లలేమని వాపోయారు. ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్న ప్రొ.ఘంటా చక్రపాణి, ఇతర వీసీల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.
రెగ్యులర్ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును ప్రభుత్వం పెంచిందని, తమను మాత్రం నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కొన్ని యూనివర్సిటీల్లో ప్రిన్సిపాల్, డీన్, హెచ్‌వోడీ, బీవోఎస్, లాంటి ప్రధాన పోస్టులలో తాము వారం రోజుల్లో జీవో నంబర్ 21పై స్పష్టతనివ్వాలని, లేదంటే యూనివర్సిటీలను స్తంభింపజేస్తామని హెచ్చరించారు. సమావేశంలో వివిధ యూనివర్సిటీలకు చెందిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు డా.చిర్ర రాజు, డా.సనత్ పాల్గొన్నారు.