09-02-2025 12:00:00 AM
లేటెస్ట్ ఫ్యాషన్ తగ్గట్టుగా అందంగా తయారుకావాలనుకుంటుంది. అయితే కేవలం అందంగా కనిపించడానికే ఫ్యాషను ఫాలో అవుతారు. అయితే మనం ఎంచుకునే దుస్తులు, ఫుట్‌వేర్ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని చాలామందికి తెలియదు. కొన్నిసార్లు ఫ్యాషన్ ఎంపికలు చాలా ప్రమాదకరంగా మారుతున్నాయి.
హై హీల్స్..
హీల్స్ రెగ్యులర్‌గా వేసుకుంటే నడుము నొప్పి, మెడ నొప్పి, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలు వస్తాయి. 30 ఏళ్లు దాటిన మహిళలు, రుతుక్రమం ఆగిపోయిన మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాలి.
ఎందుకంటే ఈ సమయంలో వారి ఎముకలు బలహీనంగా మారతాయి. వీరు హై హీల్స్ వాడితే, కాలి కండరాలు కుంచించుకుపోతాయి. దీనివల్ల మోకాళ్లపై ఒత్తిడి పెరిగి నొప్పి వస్తుంది. అందుకే మెత్తగా, కుషన్ ఉన్న అడుగు భాగం ఉన్నవాటిని వేసుకోవాలి.
బరువైన బ్యాగులు
రోజూ వాడే హ్యాండ్ బ్యాగులు చాలా బరువుగా ఉండి ఒకే భుజంపై వేసుకోవడం వల్ల నరాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీని కారణంగా ‘హెవీ-పర్స్ సిండ్రోమ్’ అనే సమస్య వస్తుంది. ఈ సమస్య మొదట్లో తెలియకపోయినా రోజు బరువు మోయడం వల్ల దీర్ఘకాలిక నొప్పులు వస్తాయి.
భుజాలు, మెడ, వెన్నెముకపై ఒత్తిడి పెరిగి, ఇబ్బంది పడతారు. చేతి మణికట్టుపై బ్యాగులు వేసుకోవడం వల్ల మోచేయి, మణికట్టుపై ఒత్తిడి పెరిగి కీళ్ల వాపు లేదా నరాల సమస్యలు వస్తాయి. అందుకే అవసరమైన వస్తువులు మాత్రమే హ్యాండ్ బ్యాగులో తీసుకెళ్లాలి. దాన్ని ఒక భుజం నుంచి మరోవైపుకు మారుస్తూ ఉండాలి.
టైట్ దుస్తులు
టైట్ దుస్తులు ఆరోగ్యానికి హానికరం. మరీ ముఖ్యంగా పొడవాటి లంగా లేదా ధోతీని నడుముకు బిగుతుగా కట్టుకోవడం వల్ల ‘పెటికోట్ క్యాన్సర్’ అనే సమస్య వస్తుంది. టైట్ జీన్స్ కూడా ప్రమాదకరం. బిగుతైన దుస్తులు రక్త ప్రసరణను తగ్గిస్తాయి. దీంతో కాళ్లలో తిమ్మిర్లు వస్తాయి. ఇవి కడుపుపై ఒత్తిడి పెంచి అజీర్తి, గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలకు కారణం అవుతాయి.