calender_icon.png 7 October, 2024 | 4:57 AM

రుణమాఫీ విషయంలో తప్పుదారి పట్టించొద్దు

07-10-2024 01:47:20 AM

ఎస్‌బీఐ ఖాతాదారుల్లో 50 శాతం మందికే మాఫీ

సీఎం రేవంత్‌కు మాజీమంత్రి హరీశ్‌రావు బహిరంగ లేఖ

హైదరాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): రైతు రుణమాఫీ విషయంలో తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టించినట్లే, యావత్ దేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఆదివారం సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు.

రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వైఖరిని దేశ ప్రజల దృష్టికి తీసుకొచ్చేందుకే ఈ లేఖ రాసినట్లు చెప్పారు. రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ పూర్తి చేశామని సీఎం రేవంత్ చేసిన ప్రకటన పూర్తి అవాస్తవమన్నారు. రాష్ట్రంలో ఒక లక్షలోపు రుణం ఉన్న రైతుల సంఖ్య 5,74,137 కాగా, 2,99,445 మందికి మాత్రమే మాఫీ అయ్యిందని చెప్పారు.

రూ.1లక్ష నుంచి 1.5 లక్షల మధ్య రుణం ఉన్న రైతుల సంఖ్య 2,62,341 కాగా, వీరిలో ఇప్పటివరకు 1,30,915 మంది రైతుల రుణం మాత్రమే రద్దయ్యిందన్నారు. 2 లక్షల వరకు ఉన్న రైతుల సంఖ్య 1,65,607 కాగా, 65,231 మంది రైతులకు మాత్రమే మాఫీ అయిందన్నారు.

ఎస్‌బీఐ ఖాతాల ద్వారా రుణం తీసుకున్న రైతుల్లో 50 శాతం మందికి మాత్రమే అప్పు తీరిందని, ఈ విషయం ఆర్టీఐ ద్వారా ఆ బ్యాంకే చెప్పిందన్నారు. ఇతర బ్యాంకుల్లోనూ ఇదే దుస్థితి నెలకొందన్నారు. రూ. 2లక్షల కంటే ఎక్కువ అప్పు ఉన్న రైతులు.. పై మొత్తాన్ని చెల్లిస్తే.. రుణమాఫీ చేస్తామని సీఎం ప్రకటించారని హరీశ్‌రావు గుర్తు చేశారు.

చాలామంది రైతులు పై మొత్తాన్ని చెల్లించినా.. మాఫీ జరగలేదని ఆర్టీఐ పిటిషన్‌కు ఎస్‌బీఐ బదులిచ్చిందన్నారు. అంతేకాకుండా, రుణమాఫీకి 31 షరతులను పెట్టి చాలామంది రైతులు అర్హులు కాకుండా చేశారని మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ ఆరేళ్ల పాటు రూ.72,000 కోట్లు రైతులకు రైతు బంధు ద్వారా అందించారన్నారు.