calender_icon.png 29 September, 2024 | 4:49 AM

తప్పుదోవ పట్టించొద్దు

29-09-2024 03:02:43 AM

ఇంగ్లిష్‌పై పట్టులేకుండానే సీఈగా ఎలా పని చేశారు?

  1.  మాజీ ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు తీరుపై కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ ఆగ్రహం
  2.  కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలపై ప్రశ్నల వర్షం 
  3. మళ్లీ పిలిస్తే విచారణకు రావాలని ఆదేశం

హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): కాళేశ్వరం డీపీఆర్ ఆమోదం తర్వాత డిజైన్లలో మార్పులు ఎందుకు జరిగాయి? రాఫ్ట్, గేట్లు, పిల్లర్ల సంఖ్య, బ్యారేజీ పొడవులో ఎందుకు మార్పు వచ్చింది? ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? బ్యారేజీల నిర్మాణ వ్యయం ఎంత అయ్యింది? పిల్లర్లు ఎందుకు డ్యామేజీ అయ్యాయి.

కారణాలు ఏంటి? మేడిగడ్డ ఆనకట్టకు సీకెంట్ ఫైల్స్‌ను వినియోగించాలని ఎవరు చెప్పారు? శనివారం కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లుపై చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నల వర్షం కురిపించారు. కొన్ని ప్రశ్నలకు వెంకటేశ్వర్లు చెప్పిన సమాధానాలపై జస్టిస్ పీసీ ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల గురించి ప్రశ్నించారు. సీకెంట్ ఫైల్స్‌పై వెంకటేశ్వర్లు చెప్పిన సమాధానంపై జస్టిస్ ఘోష్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కమిషన్‌ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయవద్దని వారించారు. 

ఇంగ్లిష్ రాకుండానే సీఈగా పనిచేశారా?

మాజీ ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు చెప్పిన పొంతన లేని సమాధానాలతో కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ అసహనం వ్యక్తం చేశారు. వెంకటేశ్వర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్న సమయంలో అఫిడవిట్‌ను చూసి సమాధానాలు చెప్పారు. అఫిడవిట్‌ను చూసి సమాధానం చెప్పడం ఏంటని అడిగారు.

కమిషన్‌కు తప్పుడు సమాచారం ఇస్తారా? అని ప్రశ్నించారు. మేడిగడ్డ ఆనకట్టకు సీకెంట్ ఫైల్స్‌ను వినియోగించాలని ఎవరు చెప్పారని కమిషన్ ప్రశ్నించగా.. సీడీవో సీఈ సూచించారని బదులిచ్చారు. సీడీవో సీఈ కేవలం డిజైన్స్, డ్రాయింగ్ మాత్రమే ఇస్తుందని జస్టిస్ ఘోష్ అన్నారు.

మిగతా విషయాల్లో ఎలా జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించారు. తన వద్ద ప్లాన్స్, డిజైన్స్ ఉన్నాయని చైర్మన్ స్పష్టంచేశారు. తనను అయోమయంలోకి నెట్టవద్దని జస్టిస్ పీసీ ఘోష్ వారించారు. ఈ క్రమంలో సమాధానాన్ని సవరించుకునే అవకాశం ఇవ్వాలని వెంకటేశ్వర్లు కోరారు.

కమిషన్ చైర్మన్ ఇందుకు అంగీకరించలేదు. తగిన డాక్యుమెంట్స్ సమర్పిస్తే సవరించే అవకాశం ఇస్తానని సూచించారు. ఇదే సమయంలో తనకు ఇంగ్లిష్‌పై పూర్తి పట్టు లేదని వెంకటేశ్వర్లు చెప్ప గా.. ఆంగ్లంపై పట్టు లేకుండానే కాళేశ్వరం సీఈగా ఎలా పనిచేశారని అసహనం వ్యక్తం చేశారు. 

సవరించిన అంచనాలను ఆమోదించింది ఎవరు? 

బ్యారేజీల నిర్మాణ వ్యయం ఎంత అయ్యిందని కమిషన్ అడగ్గా.. డీపీఆర్‌లో అన్ని వివరాలు ఉన్నాయని వెంకటేశ్వర్లు బదులిచ్చారు. అలాగే, రేపు ప్రతిని అందజేస్తానని చెప్పారు. వ్యాప్కోస్ నివేదికపై కమిషన్ ఆరా తీసింది. ఆ నివేదికను ఎవరు ఆమోదించారని అడిగారు. 

2016లో ఉన్న తస్థాయి కమిటీ ఆమోదించిందని వెంక టేశ్వర్లు సమాధానం చెప్పారు. సవరించిన అంచనాలు ఆమోదించింది ఎవరు? ఎప్పుడు చేశారు? అని ప్రశ్నించగా.. 2018 మే 19న మొదటి, 2021 సెప్టెంబర్ 6వ తేదీన రెండో సవరణ జరిగిందని వెల్లడించారు. కాళేశ్వరం ఆనకట్టల నిర్మాణానికి మొ త్తం 11 అనుమతులు తీసుకున్నట్టు తెలిపారు. 

పిల్లర్ల డ్యామేజీకి కారణాలు ఏంటి?

కాళేశ్వరం ఉన్నతస్థాయి కమిటీలో ఉండే వారి గురించి కూడా కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ అడిగి తెలుసుకున్నారు. అలాగే పిల్లర్ల డ్యామేజీకి కారణాలు ఏంటని ప్రశ్నించగా, మోతాదుకు మించిన వేగంతో నీటి విడుదల వల్లే డ్యామేజ్ అయిందని మాజీ ఈఎన్‌సీ వివరించారు. 

భూసేకరణ సమస్య, విద్యుత్ పొదుపు, గ్రావిటీ ద్వారా నీటి సరఫరా కోసమే అన్నారం, సుందిళ్ల సైట్లను మార్చినట్టు కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. చివరికి వెంకటేశ్వర్లు చెప్పిన సమాధానాలపై అసహనం వ్యక్తం చేసిన కమిషన్.. విచారణ ను మధ్యలోనే ఆపేశారు.