మాయగాళ్ల మాటలు నమ్మి మోసపోకండి
నిరుద్యోగులకు మంత్రి రాజనర్సింహ సూచన
హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేవారి మాటలు నమ్మి మోసపోవద్దని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నిరుద్యోగులను హెచ్చరించారు. ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 11 నెలల్లోనే 7 వేల పైచిలుకు పోస్టులను భర్తీ చేశామని గుర్తు చేశారు.
మరో 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు, 732 ఫార్మసిస్ట్ (గ్రేడ్ 2) పోస్టులు, 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, 156 ఆయుష్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు, 45 అసిస్టెంట్ ప్రొఫెసర్(ఎంఎన్‌జే) పోస్టులు, 24 ఫుడ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని పోస్టులకు నోటిఫికేషన్లు వస్తాయన్నారు. విద్యార్హతలు, రాతపరీక్షలు ఇతర నిబంధన ప్రకారం పారదర్శకంగా ఈ పోస్టుల భర్తీ జరుగుతుందని పేర్కొన్నారు.
ఇందులో ఎలాంటి రాజీలేదని, ఉద్యోగాలు ఇప్పిస్తామని దళారుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. అలాంటి వారి సమాచారాన్ని పోలీసులకు ఇచ్చి, వారిఫై ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు మోసగాళ్ల సమాచారాన్ని అందజేయాలన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసేవారిపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు