calender_icon.png 15 January, 2025 | 9:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధైర్యపడొద్దు.. ఆదుకుంటాం

03-09-2024 01:40:12 AM

  1. నివేదిక రాగానే నష్టపరిహారం పంపిణీ
  2. అసాధారణ వర్షంవల్లే అనుకోని విపత్తు
  3. మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్స్ నిర్మిస్తం
  4. ఖమ్మం పర్యటనలో సీఎం

ఖమ్మం, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): వరదల్లో సర్వం కోల్పోయిన ఖమ్మం వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని సీఎం రేవంత్ భరోసా ఇచ్చా రు. సోమవారం సాయంత్రం డిఫ్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మ ల, ఉత్తమకుమార్‌రెడ్డితో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులను పరామర్శించారు. కరుణగిరిలోని నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీలోని రాజీవ్ గృహకల్ప, బొక్కలగడ్డ, ప్రకాశ్‌నగర్ ప్రాంతాల్లో పర్యటించి బాధితులతో మాట్లాడారు.

యుద్ధప్రాతిపదికన నష్ట నివారణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. వరద నష్టంపై సర్వే నివేదిక రాగానే బాధితులకు ఎటువంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుం టామని హామీ ఇచ్చారు. ఎవరూ ఆందోళన పడాల్సిన పని లేదని స్పష్టంచేశారు. 42 సెంటీ మీటర్ల వర్షపాతం వల్లే మున్నేరుకు భారీగా వరదలు వచ్చి తీవ్ర నష్టం జరిగిందన్నారు. పేదలు సర్వం కోల్పోయి కట్టు బట్టలతో మిగిలారని ఆవేదన వ్యక్తంచేశారు. 60 ఏళ్లలో ఇంతటి ఉపద్రవం ఎన్నడూ సంభవించలేదని తెలిపారు.

వరద బాధితులను తక్షణం ఆదుకునేందుకు కలెక్టర్ వద్ద రూ.5 కోట్లు సిద్ధంగా ఉంచామని చెప్పారు. ఈ నిధలుతో బాధితులకు నిత్యావసర సరుకులు, పాలు, ఉప్పు, పప్పు, బియ్యం అం దజేసేస్తామని వెల్లడించారు. తక్షణ సాయం గా ప్రతి బాధితుడికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. 

మున్నేరు ముప్పును అరికడుతాం

మున్నేరు వల్ల భవిష్యత్తులో వరద నష్టం జరుగకుండా రూ.౬౮౦ కోట్లతో ఏరుకు రెండు వైపులా రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నామని సీఎం చెప్పారు. టెండర్లు పిలిచి, పనులు కూడా ప్రారంభించామని గుర్తుచేశారు. వచ్చేవానకాలం నాటికి దీనిని పూర్తి చేసి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. వరదల్లో డాక్యుమెం ట్లు, సర్టిఫికెట్లు తదితర ముఖ్యమైన పత్రాలు పాడైపోతే బాధితులకు ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందని తెలిపారు.

రాజీవ్ గృహ కల్పలో బయ్య సాయి, గుత్తా రమేశ్ ఇళ్లలోకి వెళ్లిన సీఎం.. వరద నష్టం గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా వరద బాధితులకు నిత్యావసర సరుకులు అందజేశారు. అంతకముందు పాలేరులో ఆగి రిజర్వాయర్‌ను పరిశీలించారు. అనంతరం సాగర్ ఎడమ కాల్వకు గండి పడ్డ ప్రాంతాన్ని కూడా సీఎం సందర్శించారు.