calender_icon.png 28 September, 2024 | 3:04 AM

పక్షపాతంతో వ్యవహరించొద్దు

28-09-2024 12:52:19 AM

తిరుమల లడ్డూ వివాదం దేశ్యవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ముఖ్యంగా ఈ విషయంలో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు స్పందిస్తుండటం వల్ల సామాజిక మాధ్యమాలన్నీ వేడెక్కాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, నటుడు ప్రకాశ్‌రాజ్ మధ్య ట్వీట్ల వార్ తగ్గేదేలే అన్నట్టుగా కొనసాగుతోంది. ప్రకాశ్‌రాజ్ ఓవైపు ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ మరోవైపు ఇదే విషయాన్ని చర్చించుకునేలా చేస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా నటి ఖుష్బూ సైతం ఈ విషయంలో స్పందించారు. ‘తిరుమల లడ్డూ గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకున్నప్పుడు మనల్ని సైలెంట్‌గా ఉండమంటే ఎలా? ఇతర మతాల విషయంలోనూ ఇలానే వ్యవహరిస్తారా? అలాంటి ఆలోచన చేయాలంటేనే చాలామందికి వెన్నులో వణుకు పడుతుంది.

లౌకికవాదం అంటే ప్రతి మతాన్ని గౌరవించడం, అంతేగానీ పక్షపాతంతో వ్యవహరించొద్దు. నేను హిందూ మతంలో పుట్టకపోయినా.. ఈ మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. నాకు అన్ని మతాలూ సమానమే. హిందూ మతాన్ని అవమానించొద్దు.. చులకనగా మాట్లాడొద్దు.

దాన్ని అగౌరవపరిస్తే సహించొద్దు. తిరుమల లడ్డూలు కల్తీ చేయడమంటే కోట్లాది మంది ప్రజల మనోభావాలు, విశ్వాసాలు దెబ్బ తీయడమే. బాధ్యులు కచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే. వేంకటేశ్వరస్వామి చూస్తున్నాడు’ అని తన పోస్ట్‌లో పేర్కొన్నారామె.