calender_icon.png 26 October, 2024 | 4:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాంబులు.. బెదిరింపులకు భయపడం

26-10-2024 01:45:02 AM

  1. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
  2. మంత్రి పొంగులేటి వ్యాఖ్యలకు ఘాటుగా సమాధానం

సిరిసిల్ల,అక్టోబర్ 25 (విజయక్రాంతి): ‘ఒరిజనల్ బాంబులకే మేం భయపడం.. అలాంటిది తుస్సు బాంబులకు మేమెలా భయపడతాం ? బెదిరింపులకు ఎందుకు తలొగ్గుతాం?’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ నిప్పులు చెరిగారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఘాటుగా సమాధానమిచ్చారు.

సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో శుక్రవారం విద్యుత్ చార్జీల పెంపుపై ఈఆర్సీ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హేమాహే మీలైనా నాటి ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు నాయుడికే తాము భయపడలేదని, ఇప్పుడు కాంగ్రెస్ నేతలు చేసే తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

అక్రమ కేసులు పెట్టి తమను జైలు పంపించినా భయమపడమని, అందుకు వంద రేట్లు బదులు తీసుకుంటామని తేల్చిచెప్పారు. అధికారులు, రియల్టర్లను బెదిరింపులకు గురిచేస్తున్న వారికి తాము అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. పారిశ్రామికవేత్తలు, పవర్ హాలీడేస్ వద్దని ఇప్పటికే ఇందిరా పార్క్ వద్ద ధర్నాలకు దిగిన పరిస్థితి ఉందన్నారు.

సిరిసిల్లలో పవర్ లూమ్ పరిశ్రమ కరెంట్‌తోనే ముడిపడి ఉందని, ఇక్కడ కూడా కరెంట్ లేక ఎంతో మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధిలో విద్యుత్‌తో విడదీయరాని సంబంధం ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో  తీసుకున్న నిర్ణయాలు పదేళ్ల పాటు విద్యుత్ సంస్థలకు సువర్ణయుగంగా ఉండేదన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే కరెంట్ కోతలు మొదలయ్యాయన్నారు. పాలకులకు విజన్ ఉంటేనే సంపదను పెంచి, పేదలకు పంచగలరని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలా కరెంట్ చార్జీల భారం మోపి, ప్రభుత్వ ఖజానా నింపుకోవాలనే ఆలోచన చేయడం దుర్మార్గమన్నారు. డిస్కంలంటే డిస్టిబ్యూషన్ సంస్థలనీ, అవి ఖజానా నింపే కంపెనీలు కాదన్నారు.

విద్యుత్ అంటే వ్యాపారం కాదని, రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టించే రథ చక్రమని నొక్కి చెప్పారు. తమ ప్రభుత్వంలో పంటలకు 24 గంటల పాటు ఉచిత కరెంట్, మిషన్ భగీరథ వంటి ప్రాజెక్ట్‌లో ఇంటింటికీ ఉచితంగా శుద్ధజలం సరఫరా చేసినప్పటికీ ప్రజలపై ఒక్క రూపాయి కూడా భారం వేయలేదన్నారు. సిరిసిల్లలో నేతన్నలకు 10 హెచ్‌పీపై 50 శాతం సబ్సిడీ సైతం ఇచ్చామన్నారు.

ఇప్పుడు 10 హెచ్‌పీలను 30 హెచ్‌పీల వరకు 50 శాతం సబ్సిడీ ఇవ్వాలని కోరుతున్నామన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పదేళ్లు బతుకమ్మ చీరలు, స్కూల్ యూనిఫాం వంటి ఆర్డర్లు నేతన్నలకు ఇచ్చామన్నారు. వర్కర్ టు ఓనర్ పథకం ద్వారా దాదాపు రూ.400 కోట్లు ఖర్చు  చేశామన్నారు. 

మానవత్వాన్ని చాటుకున్న కేటీఆర్

సిరిసిల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొని కేటీఆర్ తిరిగి తన కాన్వాయ్‌లో హైదరాబాద్‌కు వెళ్తున్నారు. మార్గమధ్యంలోని తంగళ్లపల్లి మండలం జిల్లెల -రామచంద్రపూర్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. వ్యాన్ బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న నర్సింహులపల్లెకు చెందిన ముగ్గురు గాయాల పాలయ్యారు. ఇదే సమయంలో అటుగా కారులో వెళ్తున్న కేటీఆర్ వెంటనే వాహనాలను ఆపారు. కేటీఆర్ దగ్గరుండి అంబులెన్స్‌కు కాల్ చేశారు. క్షతగాత్రులను దగ్గరుండి సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించేలా చొరవ తీసుకున్నారు.

ధర్నాలతో దద్దరిల్లుతున్న తెలంగాణ..

రాష్ట్రం దద్దమ్మ పాలనలో ధర్నాలతో దద్దరిల్లుతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా ఎద్దేవా చేశారు. అలంపూర్ మొదలు ఆదిలాబాద్ వరకు రైతుల నుంచి రైస్ మిల్లర్ల వరకు, కార్మికుల నుంచి కాంట్రాక్టర్ల వరకు ప్రభుత్వ నిర్ణయాలపై నిరసనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. టీచర్లు, పోలీసుల కుటుంబాల నుంచి అవ్వా తాతలు, ఆడబిడ్డలు, విద్యార్థుల నుంచి విద్యావంతుల వరకు రాష్ట్రప్రభుత్వ తీరుతో అసంతృప్తితో ఉన్నారన్నారు.