28-03-2025 01:18:36 AM
400 ఎకరాలు అమ్మడం కరెక్ట్ కాదు
మరో 800 ఎకరాలు కలిపి జాతీయ పార్కు ఏర్పాటు చేయాలి
గచ్చిబౌలి భూముల వేలంపై
సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ
హైదరాబాద్, మార్చి 27 (విజయక్రాంతి): చనిపోతే పూడ్చేందుకు కూడా భూములు లేకుండా అమ్మడం కరెక్టు కాదని పేర్కొన్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఇప్పు డు పర్యావరణం, జీవవైవిధ్యాన్ని నాశనం చేస్తూ గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ భూములను అమ్మాలనుకో వడం ఎంతవరకు సమంజసమని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు.
ఈ 400 ఎకరాల భూమిని, దానిని ఆనుకుని ఉన్న మరో 800 ఎకరాల భూమిని కలిపి జాతీయ ఉద్యానవనంగా ప్రకటించే అవకాశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురు వారం సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు. ఆర్థిక వనరుల సమీకరణ పేరి ట టీజీఐఐసీ ద్వారా రాష్ర్ట ప్రభుత్వం వేలం వేసే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భవిష్యత్ తరాలను, ప్రజా ప్రయో జనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ భూముల అమ్మకానికి వ్యతిరేకంగా మాట్లాడిన విషయాన్ని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. ‘మనం బతకడానికి, మన సోకులకు ప్రభుత్వ భూములు అమ్మొద్దు, ఒకవేళ ప్రభుత్వ భూములను అమ్మితే భవిష్యత్తులో ప్రజల అవసరం కోసం ఏదైనా నిర్మించాలన్నా, ప్రభుత్వ ఆస్పత్రులు కానీ, విద్యాలయాలు కానీ, చివరకు చచ్చిపోతే శ్మశానాలకు కూడా భూమి లేని పరిస్థితి ఉంటుంది’ అంటూ వ్యాఖ్యలు చేసి మర్చిపోయారా? అని పేర్కొన్నారు.
జీవవైవిధ్యానికి నెలవు ఈ భూమి..
ఈ 400 ఎకరాల భూములను ఆనుకుని జీవవైవిధ్యానికి నెలవైన అనేక వృక్షజాలం, జంతుజాలం, సరస్సులు ఉన్నాయని.. ఇందులో 734 వృక్షజాతులు, 220 పక్షిజాతులు ఉన్నాయని, వైవిధ్యభరితమైన జీవజా తులు, మషమ్ రాక్‌తో సహా సహజసిద్ధంగా ఏర్పడి ఎంతో ఆకర్షణీయంగా ఉండే రాళ్లు ఎన్నో ఉన్నాయని కిషన్‌రెడ్డి తెలిపారు.
ఈ ప్రభుత్వ భూమి అటవీశాఖ పరిధిలోకి రానప్పటికీ చుట్టూ పచ్చని చెట్లతో, వైవిధ్యమైన జీవజాతులతో నగరానికి ఊపిరు లూదే ఆక్సిజన్ వనరుగా ఉందన్నారు. అలాంటి ఈ భూమిని కాంక్రీట్ నిర్మాణాలతో నింపేస్తే పర్యావరణానికి, నగరానికి పెద్దఎత్తున ముప్పు చేకూరే అవకాశం ఉందన్నారు.
నగరంలో ఒకప్పుడు అడవులు, కొండలతో ఉండే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాలు పట్టణీకరణ కారణంగా ఒక కాంక్రీట్ జంగిల్‌గా మారి, సహజసిద్ధమైన వాటి స్వరూపాన్ని కోల్పోయాయన్నారు. 400 ఎకరాల భూముల అమ్మకాన్ని స్థానిక ప్రజలు, ఆ భూమికి పక్కనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు ఎవరూ ఆమోదించడం లేదన్నారు. పర్యావరణం, జీవ వైవిధ్యానికి ఎలాంటి నష్టం చేకూర్చకుండా సంరక్షిస్తారని, ఈ 400 ఎకరాల ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.