26-03-2025 11:59:10 PM
మమ్ముట్టి కోలుకోవాలనే శబరిమలలో పూజలు
స్నేహితుడి కోసం పూజలు చేస్తే తప్పేంటి?
స్పందించిన నటుడు మోహన్‌లాల్
తిరువనంతపురం: ప్రముఖ నటుడు మోహన్‌లాల్ తన స్నేహితుడు మమ్ముట్టి కోసం శబరిమలలో పూజలు చేయడంపై వివాదం నెలకొంది. ముస్లిం అయిన మమ్ముట్టి పేరుతో ఆలయంలో పూజలు ఎలా చేస్తారని మోహన్‌లాల్‌పై విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ వివాదంపై మోహన్‌లాల్ స్పందించారు. ప్రార్థనలు వ్యక్తిగతమని.. దీనిని వివాదంతో ముడిపెట్టి చూడొద్దని హితవు పలికారు. స్నేహితుడైన మమ్ముట్టి అనారోగ్యం బారిన పడ్డారని తెలిసి.. శబరిమలలో ప్రత్యేక పూజలు చేయించానని వివరించారు. దీనిపై వివాదం చేయాల్సిన అవసరం లేదన్నారు. అయినా స్నేహితుడు కోలుకోవాలని పూజలు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఇది తన వ్యక్తిగత విషయమని.. ప్రస్తుతం మమ్ముట్టి కోలుకున్నారని తెలిపారు.
దేవస్థానానికి చెందినవారే పూజకు సంబంధించిన వివరాలు బయటికి చెప్పి ఉండొచ్చని మోహన్‌లాల్ ఆరోపించారు. అయితే మోహన్‌లాల్ వ్యాఖ్యలపై ట్రావెన్‌కోర్ బోర్డు స్పందించింది. ‘మోహన్‌లాల్ అపార్థం చేసుకున్నట్టున్నారు. అందుకే ఆలయ బోర్డును తప్పుబట్టారు. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారని భావిస్తున్నాం’ అని పేర్కొంది. తన కొత్త సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ నెల 18న మోహన్‌లాల్ శబరిమలను సందర్శించారు. ఆ సమయంలో మమ్ముట్టి పేరు మీద ఉషా పూజ జరిపించారు. పూజ సమయంలో మమ్ముట్టి అసలు పేరు మహ్మద్ కుట్టి అని పేర్కొన్నారు.