18-02-2025 07:03:11 PM
చెన్నూరు ఏడీఏ బానోత్ ప్రసాద్...
మందమర్రి (విజయక్రాంతి): అన్నదాతలు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని చెన్నూరు సహాయ వ్యవసాయ సంచాలకులు బానోత్ ప్రసాద్ కోరారు. మండలంలోని సారంగపల్లి గ్రామంలో రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై రైతులందరికీ అవగాహన ఉండాలని, పథకాల విధి విధానాలు తెలుసుకోవాలని సూచించారు. తద్వారా పథకాల వినియోగం జరిగి రైతులకు లబ్ది చేకూరుతుందన్నారు. అదే విదంగా ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ వంటి పథకాలపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం ఉద్యానవన అధికారి కల్యాణి మాట్లాడుతూ... ఆయిల్ పామ్ సాగు, సబ్సిడీ వివరాలు, సూక్ష్మ సేద్య పరికారాలపై సబ్సిడీ, పందిరి కూరగాయల సాగు, ఆయిల్ పామ్ లో అంతర పంటగా కొకోవా సాగు, తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవనజ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, ఎస్ బీ ఐ జనరల్ ఇన్సూరెన్స్ వంటి పథకాలపై తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఫీల్డ్ అధికారి రాజేష్ రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయ విస్తరణ అధికారి ముత్యం తిరుపతి, వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన పశుసంవర్ధక శాఖ, ఉద్యానవన శాఖ, మత్స్య శాఖ, పట్టు పురుగుల పెంపకం, తేనెటీగల పెంపకం వంటి అంశాలపై రైతులకు కావలసిన సమాచారం కోసం సంబంధిత శాఖల అధికారులతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి వ్యవసాయ శాఖ తోడ్పడుతుందని తెలిపారు. సమావేశంలో పంచాయతి కార్యదర్శి సవ్య, రైతులు కమల మనోహర్, ఫిరోజ్, రాయమల్లు, ఆసంపెల్లి రాజయ్య, ఖలీమ్, గౌస్, ముజఫర్, మహేందర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి లు పాల్గొన్నారు.