16-04-2025 08:10:52 PM
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి..
మహబూబాబాద్ (విజయక్రాంతి): విద్యాభివృద్ధికి దాతల కృషి అవసరమని, ప్రభుత్వ విద్యాలయాలను ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తోందని, స్థానికంగా దాతల సహకారం ఉంటే పేద విద్యార్థులకు మెరుగైన విద్య అవకాశాలు దక్కుతాయని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి(MLA Yashaswini Reddy) అన్నారు. తొర్రూరు మండలం చర్లపాలెం గ్రామంలో కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఏర్పాటుచేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. పేద విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్న పాఠశాలలో సురక్షితమైన శుద్ధిచేసిన తాగునీటిని అందించేందుకు కృషిచేసిన ఫౌండేషన్ సేవలను అభినందించారు. విద్యార్థులు ఇష్టంతో చదువుకొని లక్ష్యంతో ముందుకు సాగితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఉద్బోధించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉన్న సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.