- ఫ్రాంచైజీ కోసం భారీగా పెట్టుబడులు పెట్టిన రైతులు
- ఒక్కో గాడిద ధర రూ. 80 వేల నుంచి రూ. 1.50 లక్షలు
- లీటర్ గాడిద పాల ధర రూ. 1,600 కి కొనుగోలు చేస్తామని ఒప్పందం
- చేతులెత్తేసిన తమిళనాడుకు చెందిన ‘డాంకీ ప్యాలెస్’ సంస్థ
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 15 (విజయక్రాంతి) : గాడిద పాలు ఆరోగ్యానికి మేలని పూర్వీకులు చెబుతుం టారు. ప్రస్తుతం గాడిదలు తక్కువగా ఉండటం, వాటి పాలు లభ్యం కాకపోవడం.. మార్కెట్లో దీనికున్న డిమాండ్‌ను ఆసరాగా తీసుకుని తమిళనాడుకు చెంది న ఓ ముఠా, గాడిద పాల ఉత్పత్తి.. లాభా ల పేరుతో రైతులను నమ్మించి మోసం చేసింది.
ఫ్రాంచైజీ మోడల్‌లో గాడిద పాలు తీసుకొని ఓ సంస్థ సుమారు రూ. 100 కోట్లు ఎగవేసిందని బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధిత రైతులు తమ గోడు వెలిబుచ్చారు. చైన్నైలోని డాంకీ ప్యాలెస్ ఫ్రాంచైజీ గ్రూపు సభ్యులు తమను నమ్మించి మోసం చేశారని వారు ఆగ్రహం వ్యక్తంచేశారు.
తమిళనాడుకు చెందిన ఓ ముఠా కొవిడ్ నేపథ్యంలో బహుళ పోషకాలు, రోగ నిరోధక శక్తి ఇచ్చే గాడిద పాలకు డిమాండ్ ఉందంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం చేశారు. పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ప్రారంభోత్సవాన్ని అంగరంగా వైభవంగా నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి బెంగుళూరు కలెక్టర్, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ డైరెక్టర్ తదితరులు హాజరయ్యారు.
అది చూసి వందలాది మంది ఆకర్షితులై వారిని సంప్రదించారు. దాంతో, డాంకీ ప్యాలెస్ యజమాని బాబు ఉలగనాథన్ ఆధ్వర్యంలో గిరి సుందర్, బాలాజీ, సోనిక రెడ్డి, డాక్టర్ రమేష్ బృందం పెట్టుబడిదారులను బుట్టలో వేసుకున్నారు. ఫ్రాంచైజీ కోసం సెక్యూరిటీ డిపాజిట్ కింద ఒక్కో రైతు వద్ద రూ. 5 లక్షలు వసూలు చేశారు. అనంతరం ఒక్కో గాడిదను రూ.80 వేల నుంచి రూ. 1.50 లక్షల చొప్పున విక్రయించారు.
ఆ గాడిదల నుంచి ఉత్పత్తి చేసిన పాలు లీటరు రూ. 1,600 చొప్పున సేకరిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. మొదటి 3 నెలల పాటు నమ్మకం కలిగించేలా సకాలంలో నగదు చెల్లించారు. అయితే గత 18 నెలలుగా డాం కీ ప్యాలెస్‌కు సరఫరా చేసిన పాల డబ్బులు, నిర్వహణ ఖర్చులు, షెడ్ నిర్మాణం, సిబ్బంది జీతాలు, వెటర్నరీ చికిత్స ఖర్చులు ఇవ్వడం లేదు. దీనిపై ప్రశ్నిస్తే బెదిరింపులకు గురిచేశారు.
ఒక్కొక్కరికి రూ.15 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు బ్యాంకు చెక్కు లు రాసిచ్చారు. గాడిద పాలను యూరప్‌కి ఎగుమతి చేశానని, వారు రూ.10 కోట్ల చెక్కులు పంపించారని, ఆ డబ్బులను చెల్లిస్తానని బాబు ఉలగనాథన్ తమతో కాలయాపన చేస్తున్నాడని బాధితులు విలపించారు. వారిచ్చిన చెక్కులను బ్యాంకు లో వేస్తే బౌన్స్ అయ్యాయని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో దాదాపు 400 మందికి పైగా రైతులు తమ లాగా రూ. 100 కోట్లు వరకు నష్టపోయారని తెలిపారు.
ఇదో భారీ కుంభకోణమని, దీని వెనక రాజకీయ పెద్దల హస్తం ఉండొచ్చునని చెప్పారు. ఒప్పందం సందర్భంగా ఇచ్చిన జీఎస్‌టీ సంఖ్య, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ కూడా నకిలీవేనని తేలిన ట్టు తెలిసింది. మరోవైపు గాడిద పాల వ్యా పారం చేయడానికి అనుమతి లేదంటూ ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై చైన్నై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసు లు పట్టించుకోలేదు.
అలాగే గత అక్టోబర్‌లో బషీర్‌బాగ్‌లోని సీసీఎస్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని తిప్పిపంపించారు. తమ ఇళ్లను మార్టగేజ్ చేసి మరీ డబ్బులు చెల్లించాం. దీనిపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకుని న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆత్మహత్యలే శర ణ్యం అని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. డాంకీ ప్యాలెస్ నిర్వాహకులు ఇప్పటికీ ఈ దందా కొనసాగిస్తుండడం గమనార్హం.