- ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలి
- డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
- ఢిల్లీలో జరిగిన సెంట్రల్ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌లో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): పరిశోధనా గ్రాంట్లు, ప్రభుత్వం లేదా ప్రైవేటు ఏజెన్సీల ద్వారా వచ్చే విరాళాలకు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని మినహాయిం చాలని, ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీని 5శాతానికి తగ్గించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత న నిర్వహించిన జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. సీనియర్ సిటిజన్ల ఆరోగ్య బీమాకూ మినహాయింపులను పరిశీలించాలని కోరారు.
అందరికీ ఆరోగ్య బీమా అందుబాటులో ఉండేలా చూడడం ప్రాథమిక బాధ్యత అని గుర్తుచేశారు. జీఎస్టీ, సెస్ సమస్య పరిష్కారానికి మంత్రుల బృందాన్ని నియమించాలని కోరారు. రాష్ట్రం నుంచి కేంద్రం గతంలో 4.2 శాతం ఐజీఎస్టీ వాటా తీసుకునేదని, తర్వాత నిబంధనలను సవరించడంతో 5.07 శాతం కేంద్రానికి వెళ్తుందన్నారు. ఈ అంశాన్ని పరిశీలించేందుకు ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేయాల ని సూచించారు. డిప్యూటీ సీఎం సూచించిన ఈ అంశాలపై వచ్చే జీఎస్టీ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సమావేశానికి వాణిజ్య పన్నుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ హాజరయ్యారు.