09-04-2025 04:59:24 PM
సింగరేణి ఏరియా జిఎం దేవేందర్...
మందమర్రి (విజయక్రాంతి): రక్తదానం మరొకరికి ప్రాణదానమని ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ జి దేవేందర్ కోరారు. ఏరియాలోని గనుల వృత్తి ఈక్షణ కేంద్రంలో బుధవారం సింగరేణి యాజమాన్యం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. సింగరేణి కార్మికులు సమాజ సేవలో ముందు వరుసలో ఉంటారని ఆయన గుర్తు చేశారు. ఇది వరకు ఏరియాలో అనేకసార్లు రక్తదానం చేసి తమ సేవా నిరతిని చాటుకున్నారని అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ సింగరేణి కార్మికులతో పాటు కారుణ్య నియామకాల ద్వార నూతనంగా ఉద్యోగాలు పొందిన యువ కార్మికులు, రక్తదాన కార్యక్రమానికి ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయం అన్నారు.
సింగరేణి కార్మికులు అధిక సంఖ్యలో ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారని అన్నారు. ఇప్పటి వరకు ఏరియా నుండి 2856 యూనిట్ల రక్తాన్ని మంచిర్యాల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారికి అందజేసినట్లు వివరించారు. తల సేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదాన శిబిరాలను నిర్వహించి వారికి అండగా ఉంటామన్నారు. అనంతరం రక్తదాతలకు ప్రశంస పత్రాలను ఇచ్చి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జిఎం విజయ్ ప్రసాద్, ఏఐటియుస బ్రాంచి సెక్రెటరీ సలేంద్ర సత్యనారాయణ, వృత్తి శిక్షణ మేనేజర్ శంకర్, ట్రైనింగ్ అధికారి అశోక్ కుమార్, హెడ్ ఓవర్మెన్లు రాజేశం, రఘువరన్, గురుమూర్తి, పీహెచ్సి వైద్యులు రమేష్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో సభ్యుడు కాసర్ల శ్రీనివాస్, తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాసర్ల రంజిత్ కుమార్ లు పాల్గొన్నారు.