10-04-2025 09:08:18 AM
వాషింగ్టన్: సుంకాల యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చాడు. చైనా మినహా మిగతా దేశాలకు ట్రంప్ సుంకాల నుంచి ఊరట లభించింది. మిగతా దేశాలపై సుంకాలను 90 రోజులు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఆయా దేశాలు తమపై ప్రతీకార సుంకాలు విధించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని, ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ స్పష్టం చేశారు. సుంకాల తాత్కాలిక నిలుపుదలతో ఒక్కసారిగా అమెరికా స్టాక్ మార్కెట్లు(US stock markets) పుంజుకున్నాయి.
డోజోన్స్(Dow Jones) 2,500 పాయింట్లకు పైగా లాభపడింది. ఎస్అండ్ పీ 500 సూచీ 8 శాతం, నాస్ డాగ్ 10 శాతానికిపైగా లాభంతో కొనసాగుతోంది. పరస్పర రేట్లు అమల్లోకి వచ్చినప్పటి నుండి యుఎస్ మార్కెట్లు గందరగోళంలో ఉన్నాయి. సుంకాల యుద్ధం చైనా, అమెరికా మధ్య మరింత ముదురుతోంది. చైనాపై 104 శాతం నుంచి 125 శాతానికి సుంకాలు పెంచినట్లు ట్రంప్(Donald Trump) ప్రకటించారు. నిన్న ఉదయమే చైనా వస్తువులపై అమెరికా 104 శాతం సుంకం విధించింది.
ట్రంప్ సుంకాలకు(Donald Trump tariffs) ప్రతీకారంగా అమెరికా వస్తువులపై చైనా 84 శాతం సుంకాలు విధించింది. చైనా సుంకాల ప్రతీకారంగా అమెరికా మరోసారి సుంకాలను 125 శాతానికి పెంచింది. బుధవారం మధ్యాహ్నం ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్‌లో ట్రంప్ సవరించిన లెవీలను ప్రకటించారు. ఈసారి సుంకాలపై మార్కెట్లు మరో రోజు గందరగోళంలో ఉన్నాయి. ఈసారి ట్రెజరీ బాండ్లను విక్రయించడం జరిగింది. ఆ తర్వాత కొద్దిసేపటికే సూచీలు ఊపందుకున్నాయి, టెక్-హెవీ నాస్‌డాక్ రెండు దశాబ్దాల గరిష్ట స్థాయికి చేరుకుంది.