హైదరాబాద్: రోజు రోజుకు పెరుగుతూ సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎదిగిన బంగారంపై అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎఫెక్ట్ పడింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,650 తగ్గగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,790 తగ్గింది. అంతే కాకుండా ఒక్క రోజులోనే కిలో వెండి ధర రూ.3 వేలు తగ్గి ఊరట కలిగించింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72 వేలు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,560గా ఉంది. బంగారం ధరలు తగ్గడంపై మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ విజయంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల అనిశ్చితి తొలగిపోవడంతో పపంచ మార్కెట్లో బుధవారం రాత్రి నుంచి బంగారం ధరలు పతనమవుతున్నాయి. బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో పెళ్లిళ్ల సీజన్‌కు సిద్ధమవుతున్న వినియోగదారులకు ఉపశమనం లభించింది. భౌతిక మార్కెట్‌లో పుత్తడి ధరలు మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వ్యాపారులు, విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.