calender_icon.png 20 January, 2025 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డొనాల్డ్ ట్రంప్ 2.O

20-01-2025 01:00:46 AM

  1. మరికొద్ది గంటల్లో అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్
  2. ప్రమాణం చేయించనున్న చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్
  3. 100 మంది అతిథులకు క్యాండిల్‌లైట్ డిన్నర్  

వాషింగ్టన్, జనవరి 19: అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మరికొద్ది గంట ల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భార త కాలమానం ప్రకారం ఈ రోజు రాత్రి 10.30 గంటలకు ట్రంప్ అగ్రరాజ్య అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్ ట్రంప్‌తో ప్రమాణం చేయించనున్నారు.

ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకొని ఆదివారం ట్రంప్ తన సతీమణి మెలానియా ట్రంప్‌తో కలిసి వర్జీనియాలోని నేషనల్ గోల్ఫ్ క్లబ్‌కు వెళ్లి, బాణసంచా కాల్చే కార్యక్రమంలో పాల్గొన్నా రు. ఈ సమయంలో వేలాది మంది ట్రంప్ మద్దతుదారులు, ఐటీ దిగ్గజాలు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ట్రంప్ దంపతులు వాషింగ్టన్ డీసీకి చేరుకుని అతిథుల కోసం ఏర్పాటు చేసిన క్యాండిల్‌లైట్ డిన్నర్‌లో పాల్గొన్నారు.   

ప్రమాణోత్సవానికి భారత్ నుంచి..

డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి భారత ప్రభుత్వం తరఫున విదేశాంగ శాఖ మంతి ఎస్ జైశంకర్ హాజరవుతారు. జపాన్, ఆస్ట్రేలియా నుంచి విదేశాంగ మం త్రులు తకేషి ఇవాయా, పెన్నీ వాంగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరితోపాటు మరి కొందరు విదేశీ అధినేతలు ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొననున్నారు.

అలాగే బిలియనీర్లు ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్‌బర్గ్, టిక్‌టాక్ సీఈవో షౌ జి చ్యూ వంటి వ్యాపార దిగ్గజాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రమాణ స్వీకారో త్సవంలో పదవి నుంచి దిగిపోతున్న అధ్యక్షుడు కూడా పాల్గొనడం ఆనవాయితీ. జో బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ట్రంప్ ఈ సంప్రదాయాన్ని పాటించలేదు.

అయితే అవేమీ పట్టించుకోకుండా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్.. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొననున్నారు. అలాగే మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జి డబ్ల్యూ. బుష్, బరాక్ ఒబామాలు కూడా కార్యక్రమానికి హాజరవుతున్నారు. హిల్లరీ క్లింటన్, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 

తొలి రోజే సంచలన ఆదేశాలు

జో బైడెన్ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను రద్దు చేయడానికి సిద్ధమవుతున్నట్టు డొనాల్డ్ ట్రంప్ ఓ ప్రకనటలో పేర్కొన్నారు. అలాగే పెద్ద మొత్తంలో అక్రమ వసలదారులను దేశం నుంచి బహిష్కరించడం తోపాటు, ఆయిల్ డ్రిల్‌ను పెంచేందుకు అవసరమైన కార్యనిర్వహక ఉత్తర్వులపై ట్రంప్ తొలిరోజే సంతకం చేయనున్నారు.

అలాగే 2021 జనవరిలో తనకు మద్దతుగా క్యాపిటల్ భవనంపై దాడి చేసిన దోషులకు క్షమాభిక్ష పెట్టనున్నట్టు తెలుస్తోంది. ప్రమాణ స్వీకారం తర్వాత క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రులతో సమావేశం కానున్నట్టు సమాచారం.