08-02-2025 12:00:00 AM
లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ మాయ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై రవీంద్ర బెనర్జీ ముప్పనేని, శైలేశ్ రామ నిర్మిస్తున్న చిత్రం ‘డాన్ బోస్కో’. కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాకు పీ శంకర్‌గౌరి దర్శకత్వం వహిస్తున్నారు.
శుక్రవారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. నిర్మాత నాగ వంశీ ముఖ్య అతిథిగా హాజరై అధికారిక పూజా కార్యక్రమంతో చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించారు. ముహూర్తం షాట్‌కు నిర్మాత సాహు గారపాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. చుక్కపల్లి సురేశ్, చిన్నబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూవీ టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
సినిమాలోని పాత్రలు ఎలా ఉంటాయో పోస్టర్‌లో చూపించారు. పోలీస్ స్టేషన్‌లోని మోస్ట్ వాంటెడ్ బోర్డు ఆసక్తికరంగా ఉంది. ప్రిన్సిపాల్ విశ్వనాథ్‌గా మురళీశర్మ కీలక పాత్ర పోషిస్తున్నారు.
లెక్చరర్ సుమతిగా మిర్నా మీనన్ నటిస్తున్నారు. మౌనిక, రాజ్‌కుమార్ కాసిరెడ్డి, విష్ణు ఓయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమాకు సంగీతం: మార్క్ కె రాబిన్; డీవోపీ: ఎదురోలు రాజు; ఆర్ట్: ప్రణయ్ నాయిని; ఎడిటర్: గ్యారీ బీహెచ్.