calender_icon.png 24 November, 2024 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విత్తనం మీద పెత్తనం?

24-11-2024 12:00:00 AM

  1. సీడ్ తయారీలో నిబంధనలు బేఖాతర్
  2. నామమాత్రంగానే అధికారుల తనిఖీలు 
  3. రైతులను ముంచుతున్న విత్తన తయారీ కంపెనీలు

సూర్యాపేట, నవంబర్ 23 : పంట వేయడానికి ముఖ్యమైన విత్తనాలను తయారు చేసే కంపెనీలు ఆడింది ఆట పాడింది పాటగా మారింది. అధిక దిగుబడి పేరుతో నాసిరకం విత్తనాలను రైతులకు తయారీ కేంద్రాలు అంటగడుతున్నా వ్యయసాయాధికారుల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. దీంతో రైతు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోతున్నాడు. లంచాలకు అలవాటు పడి అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

తయారీ అనుమతి పొందాలంటే

విత్తనాల తయారీ కేంద్రానికి అనుమతి పొందాలంటే తమకున్న అనుభవాన్ని, దానికి అనువైన ప్రాంతాన్ని తెలియపరుస్తూ మండల వ్యవసాయాధికారికి దరఖాస్తు చేసుకోవాలి. అక్కడి నుంచి ఏడీఏకు తదుపరి జేడీఏకు ఆ దరఖాస్తు వెళ్తుంది. పూర్తిస్థాయి పరిశీలన తర్వాత విత్తన తయారీకి అనుమతులు అందజేయబడతాయి.

అనుమతిని పొందిన విత్తన తయారీ కేంద్రా లు యూనివర్శిటీ నుంచి తెచ్చుకున్న బ్రీడర్ విత్తనాలను, నాటే క్షేత్రాల వివరాలను రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థలో నమోదు చేసుకోవాలి. బ్రీడర్ సీడ్ నాటిన క్షేత్రాలను విత్తన ధ్రువీకరణ సంస్థ అధికారులు పరిశీలించి వాటి దిగుబడిని దృష్టిలో ఉంచుకుని ఫౌండేషన్ సీడ్ సంచులకు అవసరమైన ట్యాగ్‌లను ఇస్తారు.

వీటిని విత్తనపు సంచులకు అమర్చి విత్తన తయారీ కేంద్రాల యజమానులు అమ్ముకుంటారు. లేదా ఫౌండేషన్ సీడ్‌ను మరలా నాటి వాటిని సైతం విత్తన ధ్రువీకరణ సంస్థలో నమోదు చేసుకుని తిరిగి సర్టిఫైడ్ విత్తనానికి సంబంధించిన ట్యాగ్‌లను పొందుతారు. వాటిని సంచులకు అమ ర్చి రైతులకు అమ్ముకోవాల్సి ఉంటుంది. 

తక్కువ రేటుకే..

విత్తన తయారీదారులు తాము నమోదు చేసిన రైతుల భూముల్లో కొద్దిమొత్తంలో మాత్రమే నాటి ఎక్కువ మొత్తంలో ఇతర రైతుల భూముల్లో పండిస్తున్నారు. ఈ పంటను తక్కువ రేటుకు కొనుగోలు చేసి వాటినే విత్తనాలుగా తయారీ చేసి అమ్ముకుని ఎక్కువ లాభాలు పొందుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

 లేబుల్ సీడ్ అమ్మకాలే ఎక్కువ 

విత్తన రకాలపై రైతులకు అవగాహన లేకపోవడతో తయారీదారులు ట్రూత్‌ఫుల్ లేబుల్ సీడ్‌నే ఎక్కువగా అమ్ముతున్నారు. సాధారణంగా ఫౌండేషన్, సర్టిఫైడ్ విత్తనాలను నిబంధలను పాటిస్తూ తయారీ చేయాల్సి ఉంటుంది.

కానీ, ట్రూత్‌ఫుల్ లేబుల్ సీడ్‌కు ఎటువంటి విధానాలను అవలంబించాల్సిన అవసరం ఉండదు. తయారీ దారుడిపై ఉన్న నమ్మకంతో కొనుగోలు చేస్తారు కాబట్టి ఎన్ని విత్తనాలనైనా అమ్ముకునే అవకాశం ఉంది. దీనిని అడ్డుపెట్టుకుని కంపెనీలు ఇష్టం వచ్చినన్ని విత్తనాలు అమ్ముకుంటు లాభాలను గడిస్తున్నాయి. 

నిండా మునుగుతున్న రైతులు 

వరి విత్తనాలను రైతులు నమ్మకంతోనే కొనుగోలు చేస్తారు. ఒకవేళ దిగుబడులు తగ్గినా రైతులే నష్టపోతారు. తయారీదారులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. దీంతో దుకాణాల్లో ట్రూత్‌ఫుల్ లేబుల్ సీడ్ పేరిట వరి విత్తనాలను అమ్ముతున్నారు. వీటి వలన చాలామంది రైతులు అనేకసార్లు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈక్రమంలో రైతులకు దిగుబడి తక్కువగా వస్తే తయారీదారుడు నామమాత్రంగా నష్టపరిహారం అందించి చేతులు దులుపుకొంటారు. 

నామమాత్రంగా తనిఖీలు 

విత్తన తయారీ కేంద్రంలో వ్యవసాయాధికారులు తనిఖీలు నిర్వహించి విత్తనాలు ఎలా ఉన్నాయి? వాటిని ఏ సంచులలో నిల్వ చేశారు? సంచులపై విత్తనాల వివరాలను నమోదు చేశారా? వాటికి ఏ లాట్ నంబర్‌లు కేటాయించారు అనే వివరాలను పరిశీలించాల్సి ఉంటుంది. అలాగే స్టాక్ రిజిస్టర్‌ను పరిశీలించి నిల్వలు, అమ్మకాలు చేశారనే విషయాలను పరిశీలించాలి.

అయి తే ఈ తనిఖీలు నామమాత్రంగానే కొనసాగుతున్నాయి. అయితే బ్రీడర్ విత్తన క్షేత్రాల ను ఎవరూ సందర్శించకుండానే ట్యాగ్‌లు అందిస్తుండటం గమనార్హం. ప్రతీ సీజన్‌లో అధికారులకు ముడుపులు అందుతుండడంతో నామమాత్రంగానే తనిఖీ చేస్తున్నా రని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విత్తనాలపై అవగాహన ఉండాలి 

రైతులు అవగాహన లేకుండా విత్తనాలను కొనుగోలు చేయవద్దు. చుట్టూ ఉ న్న రైతుల పొలాల్లో నాటి న విత్తనాలను స్వయంగా పరిశీలించి ఏ విత్తనాలు వాతావరణానికి తట్టుకుంటున్నాయి? ఏవి దిగుబడులు బాగా వస్తున్నాయి? అనేది తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి. మార్కెట్ డి మాండ్‌ను సైతం పరిగణనలోకి తీసుకోవాలి. కొత్త రకం విత్తనాన్ని నాటా లనుకుంటే తక్కువ విస్తీర్ణంలో సాగు చేయాలి. రైతులు విత్తన రకాలపై అవగాహన పెంచుకుంటేనే సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు.

 దొంగరి నరేశ్, పంటల విబాగం శాస్త్రవేత్త, కేవీకే గడ్డిపల్లి, సూర్యాపేట జిల్లా