calender_icon.png 18 April, 2025 | 3:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరింత కష్టం కానున్న డాలర్ డ్రీమ్స్

15-04-2025 12:00:00 AM

  1. ఈబీ-5 వీసా వర్గంలో భారీ మార్పులు
  2. మరింత కఠినంగా యూఎస్ కొత్త ఇమిగ్రేషన్ రూల్స్
  3. భారతీయ విద్యార్థులకు మరిన్ని సవాళ్లు
  4. మరింత వెనక్కి కటాఫ్ తేదీ 

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: అమెరికా డాలర్ కలలు క్రమంగా చెదిరిపోతున్నాయి. మరీ ముఖ్యంగా అమెరికాకు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు స్వీకరించిన తర్వాత అగ్రరాజ్యానికి వెళ్లాలనుకునే వారికి చిక్కులు మరిన్ని ఎక్కువయ్యాయి. ఇటీవల అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన కొత్త వీసా బులిటెన్‌లో భారతీయ హెచ్-1బీ వీసా, గ్రీన్ కార్డు ఆశావహులకు భారీ షాక్ తగిలింది.

ఈ బులిటెన్ ప్రకారం ఈబీ-5 (ఎంప్లాయిమెంట్ బేస్డ్ ఫిఫ్త్ ప్రిఫరెన్స్) వీసా కింద గ్రీన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులు 6 నెలల సమయం వెనక్కు వెళ్లి.. నవంబర్ 1 2019 నుంచి మే 1 2019కి చేరుకున్నాయి. అదే చైనీయుల విషయంలో మాత్రం జనవరి 22 2014గానే ఉండడం గమనార్హం.

‘ప్రపంచంలోని అనేక దేశాల నుంచి పెరిగిన డిమాండ్‌తో సహా ఈబీ-5 అన్‌రిజర్వ్‌డ్ వీసా వర్గాల్లో భారత్ నుంచి అధిక డిమాండ్ వీసాల వినియోగం ఉంది. 2025 ఆర్థిక సంవత్సరానికి అనుమతించిన గరిష్ఠ పరిమితికి మించి వారికి ఫైనల్ యాక్షన్ కటాఫ్ తేదీ మరింత వెనక్కి జరపాల్సి వచ్చింది’ అని బులిటెన్‌లో పేర్కొన్నారు.

ఈబీ-5 వీసా ఉండి 2019 నవంబర్ 1కి ముందు గ్రీన్ కార్డు అప్లు చేసుకున్న వారి పేర్లు వెయిటింగ్ లిస్టులో చేరేందుకు మరిన్ని రోజులు వారు వేచి చూడాలి. మే1 2019కి ముందు దరఖాస్తు చేసుకున్న వారి పేర్లను మాత్రమే ప్రస్తుతం వెయిటింగ్ లిస్టులో చేర్చారు.

ఈబీ-1 విషయంలో ఎటువంటి మార్పు చేయని అమెరికా, ఈబీ-2 క్యాటగిరిలో మాత్రం స్వల్ప మార్పులు చేసింది. దీని కటాఫ్ తేదీని కాసింత ముందుకు తీసుకొచ్చిన అగ్రరాజ్యం ఈబీ-3 కటాఫ్ తేదీని కూడా ముందుకు జరిపింది.