పోలీసులమని బెదిరించి దాడిచేసిన ముఠా
నిందితులను అరెస్టు చేసిన కొత్తగూడెం పోలీసులు
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 7 (విజయక్రాంతి): పోలీసులమని చెప్పి బెదిరించి విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు కొత్తగూడెం 2వ పట్టణ సీఐ రమేష్ తెలిపారు. ఈనెల 4వ తేదీ సాయంత్రం కొత్తగూడెంకు చెందిన ఆకాష్, తరుణ్, జస్వంత్ రాజు.. రుద్రంపూర్ కోల్ హ్యాడ్లింగ్ పాయింట్ జంక్షన్ వద్ద నేషనల్ హైవే మెయిన్ రోడ్డు దగ్గర రీల్స్ తీస్తుండగా వారిని గమనించిన పెనగడపకు చెందిన నలుగురు వ్యక్తులు కారులో వచ్చి.. మేము పోలీసులమని చెప్పి ఫోటోలు ఎందుకు దిగుతున్నారు, గంజాయి తీసుకున్నారా అంటూ బెదిరించారు.
తమ ఫోన్లలో విద్యార్థుల ఫోటోలు తీసి కేసులు బుక్‌చేస్తామని బెదిరించారు. డబ్బులు ఇస్తే ఫొటోలు డిలీట్ చేస్తామనడంతో అనుమానం వచ్చిన విద్యార్థులు.. ఐడీ కార్డులు చూపిచమనడంతో.. వారు విద్యార్థులపై దాడికి దిగి వారి వద్ద ఉన్న నగదును లాక్కున్నారు. అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకువచ్చిన విద్యార్థులు.. కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలో నిందితులు పెనుగడపకు చెందిన యాకూబ్ గౌరీ, అశోక్, మనోజ్, శరత్‌చంద్ర అని తేలింది. మంగళవారం వారిని అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు.. వారి నుంచి కారు, ఫొటోలు తీసిన సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. బుధవారం నిందితులను రిమాండ్‌కు తరలించామని సీఐ రమేష్ తెలిపారు.