calender_icon.png 1 April, 2025 | 9:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శునకం...భయానకం

31-03-2025 12:37:07 AM

జిల్లాలో రెచ్చిపోతున్న గ్రామ సింహాలు పట్టించుకోని  మున్సిపాలిటీలు పెరుగుతున్న కుక్కకాటు బాధితులు కానరాని పర్యవేక్షణ కమిటీ 

మెదక్, మార్చి 30(విజయక్రాంతి): మెదక్ జిల్లాలోని పురపాలికల్లో వీధి కుక్కలు స్త్వ్రర విహారం చేస్తున్నాయి. వీధులు, ప్రధాన రహదారుల్లో గుంపులుగా సంచరిస్తూ కనిపించిన వారిపై దాడులకు ఎగబడుతున్నా యి ఏదోచోట కుక్కల దాడి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రోజురోజుకు కుక్కల బెడద అధికం కావడంతో ప్రజలు భ యాందోళనకు గురవుతున్నారు.

మరీ ముఖ్యంగా రాత్రి వేళ్లలో ఇండ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు.. చిన్నారులను ఒంటరిగా బయటకు పంపేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు. జిల్లాలో కుక్కల నియంత్రణకు అధికార యంత్రాంగం కనీస చర్యలు చేపట్టకపోవడంతో పరిస్థితి దారుణంగా మారుతోంది. చీకటి పడితే వీధుల్లో తిరగలేని పరిస్థితి కొన్నిచోట్ల ఉంటే...మరికొన్ని ప్రాంతాల్లో పగలు కూడా సమస్యగానే మారింది. చిన్నారులు, వృద్ధులు కుక్కల భారినుంచి తప్పించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. 

కనిపించని నియంత్రణ చర్యలు...

జిల్లాలో వీధి కుక్కల నియంత్రణ చర్యలు ఎక్కడా కనిపించడం లేదు. కుక్కల నియంత్రణపై పురపాలికల్లో భిన్న వాదనలు వినిపి స్తుండం విస్మయం కలిగిస్తోంది. నిబంధనల ప్రకారం వీధి కుక్కకు పిల్లలు కలగకుండా శస్త్ర చికిత్స చేయాలి. కానీ కొన్ని మున్సిపాలిటీలు కుక్కలను ఇతర ప్రాంతాల్లో వదిలిపెట్టామని చెబుతున్నా అందుకు సంబంధించిన చిత్రాలేవీ అధికార యం త్రాంగం వద్ద అందుబాటులో లేకపోవడం గమనార్హం. 

ఊసేలేని కమిటీ పర్యవేక్షణ...

ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక టీంతో సంబంధిత ప్రాంతానికి వెళ్ళి శునకాలను పడతారు వాటికి ఏబీసీ శస్త్ర చికిత్స నిర్వహించడంతో పాటు ర్యాబిస్ సూది మందు ఇచ్చి, మూడు రోజుల అనంతరం మళ్ళీ అదే ప్రాంతంలో వదులుతారు. అయితే ఈ ప్రక్రియ మొత్తం మున్సిపల్ కమిషనర్, స్వచ్ఛంద సంస్థలు, పశువైద్యులతో కూడిన కమిటీ పర్యవేక్షణలో జరగాలి.

ఏ రోజుకారోజు ఎన్ని కుక్కలకు శస్త్ర చికిత్సలు జరిగాయి..తొలగించిన అవయవాలను నిర్వీర్యం చేశారా లేదా అనే అంశాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. తద్వారా నకిలీ బిల్లులకు ఆస్కారం ఉండదు. కానీ మున్సిపాలిటీల్లో కమిటీ పర్యవేక్షణ ఊసే లేకుండా పోయింది. కుక్కల ని యంత్రణకు ఖర్చు చేసిన నిధుల వివరాలు సైతం వెల్లడించేందుకు అధికారులు వెనకాడుతున్నారు. ఇలావుండగా కుక్కకాటు బాధితుల సంఖ్య మాత్రం పెరుగుతోంది.

ప్రతినెలా సగటున సుమారు పది మందికి పైగా కుక్కకాటుకు గురై ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. అయినప్పటికీ కుక్కల నియంత్రణపై దృష్టి సారించడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికకారులు స్పందించి వీధి కుక్కల బారినుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.