రాత్రి అయితే జంకుతున్న కాలనీ వాసులు...
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ కేంద్రంలో కుక్కల బెడద తీవ్రమైంది. రాత్రింబగళ్లు కాలనీలో కుక్కలు విరివిగా సంచరించడం కాలనీ వాసులకు ప్రాణాంతకంగా మారింది. ప్రతి కాలనీలో పదుల సంఖ్యలో గుంపులు, గుంపులుగా కుక్కలు స్వైర విహారం చేస్తుండడంతో ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని కాలనీ వాసులు బ్రతుకుతున్నారు. గత కొన్ని నెలలుగా కుక్కల సంఖ్య రెండింతలు అయింది. ఈ విషయమే అనేకసార్లు పలువురు మున్సిపాలిటీలో ఫిర్యాదు చేసినప్పటికీ మున్సిపాలిటీ పాలకవర్గం నామమాత్రపు చర్యలు తీసుకొని చూసి చూడనట్లు పోతున్నారు. పట్టణంలో ఇదివరకే అనేక సంఘటనలు జరిగినప్పటికీ అధికారులు పాలకవర్గం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో పాలకవర్గం గడువు ముగిసిపోగా ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో అంతు చిక్కక నెత్తి, నోరు కొట్టుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమను కాపాడాలని వాపోతున్నారు.