calender_icon.png 7 November, 2024 | 5:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శునకోపాఖ్యానం

20-04-2024 12:05:00 AM

మనుషులకంటే శునకాలకే ఎక్కువ తెలివితేటలు వుంటాయని ఒక సర్వేలో తేలిందట. కొత్తగా ఏర్పడి, అప్పుడే పాతవైన తెలుగు రాష్ట్రాల్లో శునకాలవల్ల ప్రజలు ఎన్నో బాధలకు గురవుతున్నారు.  

‘శునకాలకు పని లేదా?’ అన్నట్లు మనుషులను గాయ పరుస్తూ ప్రాణాలుకూడా తీస్తున్నా యి. చిన్న పిల్లల్ని, వృద్ధుల్ని గుర్తించి మరీ కాటు వేస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు నాలుగైదు కేసులు ఒక్కసారే ఉభయ రాష్ట్రాల్లో వరుసగా జరిగేసరికి నగర పాలకులు అప్రమత్తమయ్యారు.  శునకాలు ఈ విధంగా చెలరేగి పోవ డానికిగల కారణాలు క్యాబినెట్‌లో చర్చనీయాం శాలయ్యాయి. మంత్రులు తర్జనభర్జనలు పడ్డారు. తమ నియోజక వర్గాల్లో శునకాలెవరినీ గాయ పరచనందుకు కొందరు మనసులోనే శునకాలకు కృతజ్ఞతలు అర్పించారు. కాని, మరికొందరు అందుకు విపరీతంగా బాధ పడ్డారు. శునకాలకు శాపనార్థాలు కూడా పెట్టారు. శునకాలు గాయ పరచడానికి గల కారణాలను అన్వేషిస్తూ అందుకు నగర పాలకులను తప్పు పట్టారు కొందరు.

‘లేదు ఎమ్మెల్యేలే కారణ’మన్నారు మరి కొందరు. ఊళ్లలో శునకాలు ఎవరినీ గాయ పరచడం లేదు కనుక సర్పంచులను, వార్డు మెంబర్లను తప్పు పట్టడానికి వీలు లేదు. అసలు నగర పాలకులకే శునకాల బెడద ఎందుకు ఉంటుంది? నగరాల్లో కొందరు తమ సంతానం కంటే అధికంగా శునకాలను ప్రేమిస్తారు. ఇళ్లల్లో పెంచుకుంటారు. ముద్దుపేర్లతో పిలుస్తారు. ఒళ్లో కూర్చోబెట్టుకుంటారు. పక్కన పడుకోనిస్తారు. స్నానాలు చేయిస్తారు. వైద్యానికి ఖర్చులు పెడుతారు. వేరే ప్రాంతాలకు వెళ్లేటప్పుడు రైళ్లలో, విమానాల్లోనూ తీసుకెళ్తారు. ఉదయం వాకింగ్ చేసేవారికి శునకాలు తోడుంటే చాలు. కొందరు శునకాలకు కావలసిన ఆహార పానీయాల విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. ఈమధ్య పెంపుడు జంతువుల సంతలు వచ్చాయి. వాటిలో శునక సుఖాలకు ఎంతో గిరాకి. వేల రూపాయలు పెట్టి శునకాలను కొనుక్కుంటున్నారు. ఇంట్లో ఉండే శునకాలకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. 

ఈ తతంగమంతా బయట తిరిగే శునకాలు గమనించడం లేదని మనం అనుకుంటాం, కాని అది సరికాదు. శునకాల గోత్రాలు శునకాలకు తెలియవా? శునక భాష మనకు తెలియదు కాని, మా యజమాని వెంట ఫలానా పార్టీకి వెళ్లి ‘నేను కూడా కడుపునిండా తిన్నానని’ అనాథ శునకాలకు చెప్పకుండా ఉంటాయా? అవి ‘అయ్యో తమకూ ఆ భాగ్యం కలగలేదే’ అని బాధ పడకుండా ఉంటాయా? ఏ పార్టీ అయినా బిర్యానీ లేకుండా ఉండదాయె. మన విషయాలు మనకు తెలవడానికి వార్తా పత్రికలు, టీవీలు, సెల్‌ఫోన్లు కావాలి కాని, శునకాలకు ఇవేమీ అవసరం లేదు. అవి దొంగల్ని పసి గట్టినట్లే విషయాలను కూడా ఖచ్చితంగా తెలుసుకుంటాయి. ఒకదాని కొకటి తెలియజేస్తాయి వాటి భాషలో. శునకాలు కొట్లాడుతున్నట్లు అనిపిస్తాయి కాని, అవి మన పాలకులకంటే బెటరే. పనికి మాలిన విషయాలమీద గంటల తరబడి సభలను స్తంభింపజేస్తూ, మైకులు విరగ్గొట్టే ప్రజా ప్రతినిధులకంటే శునకాలే నయం! సమన్యాయం కోసం పోరాడే పేరుతో దొంగల్ని పట్టిస్తాయి. పోలీసు కుక్కలనే పేరు వాటికి వచ్చిందంటే వాటి కర్తవ్యదీక్ష ఏపాటిదో తెలుసుకోవచ్చు. 

పాపం, శునకాలు ఎటూ పాలు పోక ఒక నలుగురిని కాటు వేయగానే పత్రికలు తిట్టి పోశా యి. సభల్లో చర్చలు అదిరి పోయాయి. టీవీ చానళ్లు గొళ్లుమన్నాయి. శునకాల ఆగడాలను అరికట్టడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు అరిచాయి. నష్ట పరిహారాన్ని కోరాయి. కాని, అధికార పక్షం మౌనం వహించింది. ‘చూద్దాం లే. ఎన్ని శునకాలు ఎందరిని కరుస్తాయో చూసి, అప్పుడు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుందా’మనుకుంది. కాని, ఒకటి తర్వాత ఒకటి గాయ పరిచిన సంఘటనలు జరిగినా కరిచిన శునకం కరిచిన చోట ఉంటే బాగుండు. దానికి తగిన బుద్ది చెప్పొచ్చు. ‘దోచుకున్న చోటనే దొంగ ఉంటాడా?’ అట్లే శునకాలు కరిచిన చోట, పిల్లల్ని చంపిన చోట ఉండవు కదా! తృటిలో తమ పని తాము కానిచ్చి వెళ్లిపోతాయి. వాటికి బహుశా చైన్ స్నాచర్లు, చిల్లర దొంగలు ఆదర్శమేమో!  ఎట్లాగైనా శునకాల ఆగడాలను అరికట్టాలనుకున్నది అధికార పక్షం.

ఐతే, జనాభా లెక్కల్లో శునకాల లెక్కకూడా తేలకుండా ఉంది. ఏ బస్తీలో ఎన్ని ఉన్నాయో, ఏ మున్సిపాల్టీ కింద ఎన్ని శునకాలు నివసిస్తున్నాయో ఎవరికి తెలుసు! అందుకే, అధికార పక్షం మొదట నగరంలోని శునకాల సంఖ్య తేల్చాలనుకున్నది. ఒక అధికార ప్రతినిధి ఆ శునకాల్లో కూడా నల్లనివి, ఎర్రనివి, తెల్లనివి, పిచ్చి పట్టినవి, గజ్జి పట్టినవి ఎన్నెన్ని శునకాలు ఉన్నాయో గుర్తించాలని అన్నాడు. ‘ఆ విధంగా సూచించిన అధికార ప్రతినిధికే ఆ బాధ్యతలు అప్పగిస్తే బాగుండదా’ అని ఇతరులు అనుకోవడం కూడా జరిగింది. కాని, చెప్పిన వాడే చెయ్యడు కదా!  మొత్తం మీద అధికార పక్షం అత్యవసర సమావేశాల్లో ‘శునకాల ఆగడాలను అరికట్టడానికి ఒక సంఘం ఏర్పాటు చేయాలనే’ నిర్ణయానికి వచ్చింది.

జౌళిశాఖకో, పశుసంవర్ధక శాఖకో, మత్స్యశాఖకో, ఆబ్కారీ శాఖకో ప్రాతినిధ్యం వహించమంటే అందుకు సమ్మతిస్తారు కాని, ‘శునక శాఖ’కు ఎవరు ప్రాతినిధ్యం వహించగలరు? అందరూ మౌనంగానే ఉన్నారు. ఆ శాఖకు ఎవరిని ప్రతినిధిని చేయాలో ఎవరూ నిర్ణయించలేక పోయారు. ఏమి చేయలేని స్థితిని హైకమాండ్‌కు తెలిపితే ఇంకా నాలుగురోజులు ఆగమన్నది. ఈ నాలుగు రోజుల్లో ఆ సమస్య పరిష్కారమవుతుందనే ఆలోచన కావచ్చు దాని ది. కాని, ఆ నాలుగు రోజుల్లో శునకాలు విజృంభించి రకరకాల అలజడులు సృష్టిస్తే ఎట్లా? ‘ఓ నాలుగు రోజులు ఆగండి’ అని శునకాలకా చెప్పలేం, పిల్లలు ఒంటరిగా రోడ్లమీదికి రాకూడదని చెబుదామా.. అంటే, బడికి వెళ్లే పిల్లలు రోడ్లమీదికి రాక తప్పదు కదా! నాలుగు రోజులు బడులు మూసెయ్యరు కదా! 

 అధికార పక్షం సమావేశం జరుగుతుండగానే వాసన తగిలిందో ఏమో, ఓ నాలుగు శునకాలు ద్వార పాలకులను ఎదిరించి లోపల ప్రవేశించి నానా హంగామా సృష్టించాయి. ప్రతినిధులు, బాడీగార్డ్‌లు నివ్వెర పోయారు. ఏ సిబ్బంది వీటిని పట్టుకోలేక పోయారు. ప్రాణభయం అందరికీ సమానమే కదా. సమావేశం రసాభస అయ్యింది. మర్నాటికి సమావేశం వాయిదా పడింది. ఆ సమావేశం మళ్లీ ఎప్పుడు జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. శునకాల భారిన పడి ఎంతమంది ఆస్పత్రుల పాలవుతారోకూడా ఎవరూ చెప్పలేరు. అంతవరకు ఎవరైనా శునకాల మీద స్తోత్రాలు రచిస్తే చదువుకుంటూ ఉందాం!

ఆచార్య మసన చెన్నప్ప