09-02-2025 12:42:48 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలో కుక్క కాటు కేసులు బల్దియాకు పెద్ద సవాల్ గా మారుతోంది. ముఖ్యంగా వేసవి కాలం లో అత్యధికంగా జరిగే కుక్క కాటు సంఘటనలలో చిన్నారులు, వృద్దులు బాధితులుగా మారడమే గాక ఒక్కోసారి ప్రాణాలు కోల్పోతున్నారు.
వీధి కుక్కులను నియంత్రణ చేయ డంలో బల్దియా అధికారులు విఫలమవుతు న్న నేపథ్యంలో కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. రఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్న ప్రతిసారీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
మూడేళ్లలో 1.10 లక్షల బాధితులు
గ్రేటర్‌లో వీధి కుక్కల నియంత్రణకు జీహెచ్‌ఎంసీ వెటర్నరీ విభాగం ఎనిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ), యాంటీ రేబీస్ (ఏఆర్) వ్యాక్సిన్లు వేస్తుంది. ఒక వేళ కుక్కలు ప్రజలపై దాడి చేసినా ఎలాంటి ప్రాణాపా యం లేకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తల కోసం ఈ విధానాన్ని పాటిస్తున్నారు.
వీధి కుక్కల నియంత్రణ కోసం స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్, ప్రజల్లో అవగాహన కల్పించడానికి బల్దియా ప్రతి ఏడాది బడ్జెట్‌లో నిధులను కేటాయిస్తుంది. ఈ మేరకు మూడేళ్లలో దాదాపు రూ. 29.66 కోట్లను జీహెచ్‌ఎంసీ వెచ్చించింది.
అయితే కుక్కకాటు కేసులతో పాటు మరణించిన వాళ్ల సంఖ్య ఏటికేడు పెరుగుతుండడం మాత్రం అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో 2022లో 31,141, 2023లో 36,849, 2024లో 42,067 మంది మొత్తం 1.10 లక్షల మంది కుక్కకాటుకు గురవ్వగా.. 36 మంది మరణించినట్లు గణాంకాలు తెలియ జేస్తున్నాయి.
ప్రజల భద్రత కోసం
2023లో అంబర్‌పేటలో చోటు చేసుకున్న సంఘటనలో వీధికుక్కలు దాడి చేయ డంతో ఓ చిన్నారి మరణించడాన్ని కోర్టు సుమోటోగా తీసుకోగా.. ప్రస్తుతం ఆ కేసు లో జీహెచ్‌ఎంసీ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ ప్రధాన చర్చనీయాంశంగా మారు తుంది.
రాజ్యాంగం ప్రకారం ప్రజలు జీవిం చే హక్కును కాపాడేందుకు అమెరికా, బ్రిట న్ దేశాలు అమలు చేస్తున్నట్టుగా యుథనేషియా విధానం ద్వారా ప్రమాదకరమైన కుక్కలను నిర్మూలన చేసేందుకు జీహెచ్‌ఎంసీ యాక్ట్ 249 ప్రకారం అనుమతి ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ కోర్టును కోరింది.