calender_icon.png 24 November, 2024 | 10:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మురుగు పారుతున్నా పట్టదా?

17-05-2024 02:14:31 AM

మ్యాన్‌హోల్స్ లీకై  రోడ్లపైకి మురుగు

వాహనదారులకు తప్పని ఇక్కట్లు

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 16 (విజయక్రాంతి) :  నగరంలోని పలు చోట్ల రోడ్లపై మురుగు ఏరులై పారుతోంది. క్షేత్ర స్థాయిలోని అధికారులు, సిబ్బంది పట్టించుకోకపోవడంతో ఆ దారుల్లో వెళుతున్న వాహనదారులు ఇబ్బందులు పడుతుండగా, పాదాచారులు ముక్కుమూసుకుని వెళ్లాల్సి వస్తోంది. నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45, రోడ్‌నెంబర్ 51, రోడ్‌నెంబర్ 70లోని పలు ప్రధాన రోడ్లపై గల మ్యాన్‌హోల్స్ నుంచి యథేచ్ఛగా మురుగు రోడ్లపైకి వస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వాహనదారులు వాపోతున్నారు. గురు వారం ఉదయం నగరంలోని పలు చోట్ల నడి రోడ్డుపై మురుగు నీరు ప్రవహించడం కనిపించింది.

జూబ్లీహిల్స్ 45 మెయిన్‌రోడ్డులోని గీతా ఆర్ట్స్‌కు కూత వేటు దూరంలో గల ఐసీఐసీఐ బ్యాంకు ఎదుట మ్యాన్‌హోల్ లీకై రెండు రోజులుగా  మురుగు నీరు ప్రవహిస్తోంది. దీంతో, అటువైపుగా వెళ్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్ 51సైలెంట్ లేక్ వ్యాలీ థీమ్‌పార్క్ ఎదుట గల ఓ మ్యాన్‌హోల్ నుంచి వారం రోజులుగా మురుగు నీరు రోడ్డుపైకి వచ్చి ప్రవహిస్తోంది. సంబంధిత అధికారులు ఇటువైపు కూడా చూడడం లేదని వాహనదారులు, స్థానికులు వాపోతున్నారు.

జూబ్లీహిల్స్ కన్వెన్షన్ హాల్ ప్రధాన ద్వారం ఎదుట ఉన్న మ్యాన్‌హోల్ నుంచి మురుగు నీరు రోడ్డుపైకి రావడంతో నిత్యం వాహన రాకపోకలకు ఇబ్బంది కలిగి ట్రాఫిక్‌జాం అవుతోంది. జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్ 70లో గల హుడా కాలనీలో ఓ మ్యాన్‌హోల్ పొంగి మురుగు రోడ్డుపైకి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.