calender_icon.png 13 October, 2024 | 3:50 AM

మీరు తినే రెస్టారెంట్ ఫుడ్‌లో పోషకాలున్నాయా?

23-08-2024 12:30:00 AM

న్యూట్రిషన్ సమాచారం వెల్లడించని హోటల్స్‌పై రెగ్యులేటర్ కొరడా

న్యూఢిల్లీ, ఆగస్టు 22: రెస్టారెంట్లు సప్లు చేసే ఆహార పదార్థాల్లో ఏ మేరకు పోషకాలు ఉన్నాయో వాటి మెనుల్లో వెల్లడిం చవు. చిన్నవే కాదు..చాలావరకూ పెద్ద హోటళ్లూ పోషక సమాచారాన్ని వినియోగదారులకు అందించవు. అలా మెనూల్లో పోషక సమాచారాన్ని ఇవ్వని పెద్ద రెస్టారెంట్లపై కొరడా ఝుళిపించాలని కేంద్ర ప్రభు త్వం నిర్ణయించింది. రెస్టారెంట్లలో మనం తినే ఇడ్లీ, దోశ దగ్గర్నుంచి బిర్యానీల వరకూ అందులో పోషక విలువల్ని ఏ మేరకు చేకూరుస్తున్నారో రెస్టారెంట్లు తెలియపర్చవు.

సరఫరా చేసే ఆహారంలో ఉన్న కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, చక్కెర  సమాచారాన్ని తప్పనిసరిగా వినియోగదారుకు తెలియపర్చాలన్న మార్గదర్శకాలు 2022 జూలైలోనే అమలులోకి వచ్చినా, ఇప్పటివరకూ పలు రెస్టారెంట్లు పాటించడం లేదు. ఈ నిబంధనలు పాటించని పెద్ద రెస్టారెంట్లకు నోటీసులు జారీచేయడానికి ఫుడ్ రెగ్యులేటర్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నోటీసులు జారీచేయనున్నట్టు సీనియర్ అధి కారి ఒకరు చెప్పారు.

ఇప్పటివరకూ కొన్ని రెస్టారెంట్లు మాత్రమే పోషక విలువల సమాచారాన్ని వివరంగా అందిస్తున్నాయని, వేలాది హోటళ్లు నిబంధనల్ని తోసి రాజంటున్నాయని మరో అధికారి తెలిపారు. మార్గదర్శకాల ప్రకారం 10 లేదా అంతకుమించి అవుట్‌లెట్స్ ఉన్న రెస్టారెంట్ చైన్లు వాటి మెనూల్లో పోషక విలువల సమాచారాన్ని తెలియపర్చాలి. అలా పాటించని రెస్టారెంట్లకు నోటీసులు జారీచేసి, ప్రభుత్వ నిబంధనల అమలుకు గడువు విధిస్తామని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐకి చెందిన అధికారి చెప్పారు. ఈ పండుగ సీజన్‌కల్లా ఈ ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. 

మెనూల్లో చదవడం కష్టం

పలు పెద్ద, మధ్యతరహా రెస్టారెంట్ చైన్లు ఇప్పటికే వాటి మెనూ బుక్స్‌లో వివరమైన న్యూట్రిషనల్ సమాచారాన్ని ఇస్తున్నాయని, అయితే మెనూల్లో ప్రచురించిన అటువంటి సమాచారం చదవడానికి కష్టమని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సాగర్ దరయాని తెలిపారు. ఈ అసోసియేషన్‌లో 5 లక్షలకుపైగా రెస్టారెంట్లకు సభ్యత్వం ఉంది. ఫాస్ట్‌ఫుడ్ చైన్ ‘వోవ్!మొమొ’ వ్యవస్థాపకుడైన మాట్లాడుతూ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో విక్రయించే ఫుడ్ ఐటెమ్స్‌కు పోషక విలువల సమాచారాన్ని ముద్రించడం తప్పనిసరి కాదని చెప్పారు.

ప్రభుత్వ చర్యలు అవాస్తవికంగా ఉన్నాయని  పెద్ద ఫాస్ట్‌ఫుడ్ చైన్‌కు చెందిన మరో సీనియర్ ఎగ్జిక్యూటివ్ అన్నారు. తమ మెనూల్లో ఫ్యాట్స్, షుగర్ వంటి సమాచారాన్ని ఇస్తామని, అన్ని రకాల ఫుడ్ ఐటెమ్స్‌కు అది సాధ్యం కాదని చెప్పారు. ఉదాహరణకు రెస్టారెంట్లు సరఫరా చేసే సలాడ్స్‌పై పోషక సమాచారాన్ని ఎలా ఇస్తామని ప్రశ్నించారు.