- అటవీ భూమిని డీనోటిఫై చేయడంపై ప్రశ్నించిన హైకోర్టు
- కొంగరకలాన్‌లో 72 ఎకరాలపై లావాదేవీలు ఆపండి
- మధ్యంతర ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, జనవరి 28 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా ఇబ్ర హీంపట్నం మండలం కొంగరకలాన్‌లో కోట్లాది రూపాయల విలువైన 72 ఎకరాల అటవీ భూమిలో వివాదస్పద అంశాలు ఉన్నందున తుది ఉత్తర్వులు వెలువడేవరకు ఆ భూమిపై ఏ విధమైన లావాదేవీలు నిర్వహించరాదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఆదేశాలను జారీచేసింది.
ఆ భూమిని అన్యాక్రాం తం చేయరాదని కూడా ఆదేశించిం ది. అటవీ భూమిని డీనోటిఫై చేసి పట్టాలు మంజూరు చేయడంపై ఆశ్చర్యాన్ని వ్యక్తంచేసింది. కలెక్టర్‌కు డీనో టిఫై చేసే అధికారం ఉందా అని ప్రశ్నించింది. చట్ట ప్రకారం డీనోటిఫై చేశారో లేదో చెప్పాలని కలెక్టర్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
నిషేధిత జాబితా నుంచి అటవీ భూమిని తొలగించి పట్టాలు జారీ చేయాలని కలెక్టరేట్ నుంచి ఫైల్ వచ్చిందో లేదో కూడా వివరాలు ఇవ్వాలంది. తదుపరి విచారణను ఫిబ్రవరి 24కు వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
కొంగరకలాన్ గ్రామంలో సర్వే నెం 249లోని అటవీ భూమిలో 72 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించి ప్రైవేటు వ్యక్తులకు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయాలని 2019 నవంబరు 16న కలెక్టర్ జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ కే ప్రవీణ్ గౌడ్ పిటిషన్ దాఖలుచేశారు.
న్యాయవాది విజయ్ బీ పరోపకారి వాదిస్తూ, అటవీ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాక వాటిని ప్రైవేటు వ్యక్తులైన నన్నపనేని నందిత, ఎన్ డి ఇన్ఫ్రా, దండు కరుణాకర్, ఎస్ రాధాకృష్ణారెడ్డి, సోంపల్లి సాయినాథ్ రెడ్డిలకు పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీకి కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారన్నారు.
చట్ట వ్యతిరేకంగా కలెక్టర్ అటవీ భూమిని డీనోటిఫై చేశారన్నారు. ఎలాంటి విచారణ చేయకుండా ఇది జరిగిందన్నారు. దీనిపై సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడిగితే ఫైల్ కనబడటంలేదని జవాబు వచ్చిందన్నారు. వాదనల తర్వాత హైకోర్టు, అటవీ భూమిని డీనోటిఫై చేసే అధికారం కలెక్టర్‌కు లేదని ప్రాథమికంగా అభిప్రాయపడింది.
కలెక్టరేట్‌లో ఫైల్ మాయం అయినట్లుగా జవాబు ఇచ్చారా అని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై లోతుగా విచారణ చేయాల్సివుందని చెప్పింది. పూర్తి వివరాలు సమర్పించాలని రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి, రంగారెడ్డి కలెక్టర్లకు ఆదేశాలను జారీచేసింది.
సమాచార హక్కు కింద కలెక్టర్ కార్యాలయం ఇచ్చిన మెమోకు చెందిన ఫైళ్లను సమర్పించాలని కలెక్టర్‌ను ఆదేశించింది. ప్రైవేటు వ్యక్తులకు కూడా నో టీసులు ఇచ్చింది. విచారణను ఫిబ్రవరి 24కు వాయిదావేసింది.