calender_icon.png 24 November, 2024 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధర ఖరారు దళారులదే?

24-11-2024 12:18:32 AM

  1. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే అడ్డా
  2. రైతులను బెదిరించి కొనుగోళ్లు
  3. బినామీ రైతుల పేరిట సీసీఐకే విక్రయం

సిరిసిల్ల, నవంబర్ 23 (విజయక్రాంతి): రైతులు పండించిన పత్తి పంటలకు దళారులే ధరను నిర్ణయిస్తున్నారు. సీసీఐ కేంద్రాల్లోనే అడ్డా వేసి, నేరుగా రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసి, సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో బినామీ పేర్లతో అమ్ముతున్నారు. రైతులకు ఒక ధర చెప్పి, పత్తిని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి, ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు దళారులు పొందుతున్నారు.

ఒక్కో వాహనానికి దాదాపు రూ.20 వేల నుంచి రూ.25 వేల లాభం పొంది, రైతులను నిండా ముంచుతున్నారు. కామారెడ్డి జిల్లాలో 13 మండలాలు ఉండగా, సీసీఐ కొనుగోలు కేంద్రాలు 5 ఏర్పాటు చేశారు. వేములవాడలో 2, ఇల్లంతకుంట మండలంలో ఒకటి, కోనరావుపేటలో ఒకటి ఏర్పాటు చేశారు.

ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 42,332 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశారు. దిగుబడి 30 వేల మెట్రిక్ టన్నుల వస్తుందని అధికారులు అంచనా వేశారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభిచినప్పటి నుంచి ఇప్పటి వరకు 2,024 మంది రైతుల నుంచి 38,668 వేల క్వింటాళ్ల పత్తిని కొన్నారు. 

రైతు లేకుండానే తూకం

జిల్లాలో ఓ గ్రామానికి చెందిన రైతు వద్ద దళారి పత్తి క్వింటాలుకు రూ.6,200 మాట్లాడుకుని, పత్తిని రైతుతో కలిసి సీసీఐకి వారం రోజులు క్రితం తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ పత్తి వాహనాల వరుస ఎక్కువగా ఉండటంతో కొద్ది సేపటి తర్వాత వస్తానని దళారికి రైతు చెప్పి ఇంటికి వెళ్లిపోయాడు. రైతు వెళ్లిన తర్వాత ఆ వాహనాన్ని దళారి కాంటాకు పెట్టాడు. సీసీఐ ఆ పత్తికి రూ.7,300 మద్దతు ధర ప్రకటించింది.

రైతుకు మేసేజ్ పెట్టిన దళారి 25 క్వింటాళ్ల 500 కిలోల బరువు వచ్చిందని తెలిపాడు. అక్కడకు వచ్చిన రైతుల తాను లేనప్పుడు పత్తిని తూకం ఎలా వేస్తారని, తాను ట్రాక్టర్‌లో పత్తిని తీసుకువస్తే, మినీ వ్యాన్‌లో తెచ్చినట్టు రిపోర్టులో ఎందుకు వచ్చిందని నిర్వాహకులను, దళారిని నిలదీశాడు. 30 క్వింటాళ్ల బరువు వచ్చే పత్తికి కేవలం 25 క్వింటాళ్ల బరువు వచ్చిందని చెప్పడం సరికాదని రైతు ఆగ్రహం వ్యక్తం చేశాడు.

కానీ లాభం లేకుండా పోయింది. ఇందులో దళారులకు ఒక గంటలోనే రూ.25 వేల లాభం వచ్చిన్నట్టు తెలిసింది. ఇలాంటి వాహనాలు రోజుకు పదుల సంఖ్యలో దళారులు తీసుకువస్తుంటారు. అదేవిధంగా పత్తి పంట సాగుకు కోసం ఫర్టిలైజర్ యజమానుల వద్ద తీసుకున్న పత్తి మందుల కింద పత్తిని కొంటున్నారు. ఆరుగాలం పండించిన రైతుకు మాత్రం మద్దతు ధర లభించడంలేదు. దళారులు మాత్రం ఒక గంట కష్టపడి వేలల్లో లాభాలు గడిస్తున్నారు. 

ఆన్‌లైన్‌లో వివరాలు లేక..

పత్తి పంట వివరాలు ఆన్‌లైన్‌లో లేకపోవడం, గ్రామస్థాయి విస్తరణ వ్యవసా యాధికారులు పంటల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడం రైతులకు ఇబ్బందిగా మారింది. దీనిని ఆసరా చేసుకున్న దళారులకు వరంగా మారి, బినామీ రైతుల ఆధారు కార్డు, బ్యాంక్ ఖాతా నంబర్, పట్టా పాసుపుస్తకం ఇచ్చి విక్రయాలు చేపడుతున్నారు. సీసీఐ కేంద్రాల వద్ద మార్కెటింగ్ శాఖ అధికారుల పర్యవేక్షణ కరువయింది. అధికారుల అండతోనే అక్రమ కొనుగోళ్లు సాగుతున్నాయనే విమర్శలున్నాయి. 

వేములవాడలో బహిరంగానే దుకాణాలు 

వేములవాడలో ఏకంగా బహిరంగానే దుకాణాలు పెట్టి మరి దళారులు పత్తి కొనుగోళ్లు చేపడుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. టాస్క్‌ఫోర్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల దాడుల కనిపించక పోవడంతో దళారులు రెచ్చిపోతున్నారు. సీసీఐకి నేరుగా పత్తిని రైతులు తీసుకెళ్తే తేమ పేరిట కొర్రీలు పెట్టడం, అధికారులతో మాట్లాడేందుకు కొందరి రైతులకు భాష రాకపోవడంతో గత్యంతరం లేక దళారుల వైపు మొగ్గుచూపుతున్నారు.

దళారులకు రూ.6,300 నుంచి రూ.6,500 వరకు పత్తిని రైతులు విక్రయిస్తున్నారు. దళారులు పత్తిని సీసీఐకి తీసుకెళ్లి బినామీ రైతుల పేరిట విక్రయిస్తున్నారు. రూ.7,200 నుంచి రూ.7,500 ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరను దళారులు పొందుతున్నారు. 

ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం

సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద దళారులు రై తులను ఇబ్బందు లు గురిచేసినట్టు రైతులు ఫిర్యా దు చేస్తే చర్యలు తీసుకుంటాం. రైతులు దళారులకు పత్తి ని విక్రయించకుండా నేరుగా కేంద్రాలకు పత్తిని తీసుకెళ్లి, ప్రభుత్వం కల్పించే మద్దతు ధర పొందాలి. కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బం దీ చర్యలు తీసుకున్నాం. దళారులు రైతులను బయపెడితే కేసులు నమోదు చేస్తాం.

 ప్రకాష్, మార్కెటింగ్ శాఖ అధికారి, సిరిసిల్ల