హైదరాబాద్: తెలంగాణ యువతను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ఆరోపించారు. అశోక్ నగర్ లో ప్రజా సర్కారు విద్యార్థులను కొట్టిన విషయం రాహుల్ గాంధీకి తెలుసా? అని ప్రశ్నించారు. హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల్లో పది శాతం కంటే తక్కువే ఇచ్చారని విమర్శించారు. టీఎస్ పీఎస్సీ ప్రక్షాళన అని కేవలం టీజీపీఎస్సీగా మార్చారని పేర్కొన్నారు. జాబులు లేని జాబ్ క్యాలెండర్ ఇచ్చారని ధ్వజమెత్తారు. యువ వికాసం కింద ఇస్తామన్న 5 లక్షల హామీ నెరవేరలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ హామీ నెరవేరకపోవడంతో యువతలో అభద్రతా భావం వచ్చిందన్నారు.