calender_icon.png 2 November, 2024 | 11:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లడ్కీ బెహన్ స్కీం ఫలించేనా?

02-11-2024 01:45:43 AM

మహారాష్ట్రలో అధికార కూటమికి 

ఈ పథకం ఓట్లు తెస్తాయా?

ఎన్నికల్లో గేమ్‌చేంజర్‌గా నిలుస్తుందా?

పథకంపై ధీమాగా ఉన్న అధికార పక్షం 

ముంబై, నవంబర్ 1: మహారాష్ట్ర ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి. గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయి బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం రావడంతో ఈసారి ప్రజలు ఏ వైపు మొగ్గు చూపుతారని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని నెలల కింద షిండే ప్రభుత్వం తీసుకొచ్చిన లడ్కీ బెహన్ పథకం గేమ్ చేంజర్‌గా మారే అవకాశముందనే వాదన వినిపిస్తోంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లోని మహిళలకు ఈ ఏడాది ఆగస్టు నుంచి ప్రతినెలా రూ.1,500 అందిస్తోంది. ఈ పథకం అధికార పార్టీపై వ్యతిరేకతను తగ్గించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఖజానాపై భారం?

నగదు బదిలీ పథకాలు వివిధ రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినప్పటికీ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు తీసుకురావడం గమనార్హం. అంతేకాకుండా దీపావళికి బోనస్‌గా లబ్ధిదారులకు రూ.7,500 కూడా ముందే ప్రకటించారు. ఈ పథకాని 2 కోట్ల మంది లబ్ధిదారులు ఉండగా వీరి కోసం ప్రతినెలా రూ.3,700 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఏడాది రూ.46 వేల కోట్లు అవసరమవుతాయి. ఫలితంగా మహారాష్ట్ర అప్పులు 7.8 లక్షల కోట్లకు చేరుతాయని అధికారులు చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షం ఎక్కువ సీట్లు సాధించిన నేపథ్యంలో మహావికాస్ అఘాడీని బలహీన పరిచేందుకు అధికార కూటమి ముందునుంచే సిద్ధమైంది. కీలక ఓటు బ్యాంకుగా పరిగణించే మహిళలు, యువత టార్గెట్‌గా పథకాలు రూపొందించింది. మహిళలకు ఆర్థికసాయం అందించేందుకు లడ్కీ బెహన్, నిరుద్యోగ యువతకు భరోసా ఇచ్చేందుకు లడ్కా భావు స్కీమును తీసుకొచ్చింది. 

లంచమా? సాధికారత కోసమా?

లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి రాజ్యాంగం ప్రమాదంలో ఉందనే నినాదంతో బరిలోకి దిగగా ఆ పరిస్థితి మళ్లీ రిపీట్ కాకుండా ఈ నగదు బదిలీ పథకాలతో మహాయుతి కూటమి ముందు నుంచే ప్రణాళికలు రచించింది.అయితే, ఇలా నగదు  బదిలీ పథకాలతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందనే ఆందోళనలు ఉన్నాయి. ప్రధాని మోదీ కూడా ఉచితాల సంస్కృతిని ప్రోత్సహించవద్దని పదేపదే చెబుతుంటారు. కాంగ్రెస్ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలకు ఏటా రూ.1 లక్ష ఖాతాల్లో వేస్తామని విస్తృతంగా ప్రచారం చేసింది. ఇలాంటి పథకాలు ఓటుకు లంచం ఇచ్చినట్లేనని కొంత మంది భావిస్తుండగా మరికొంతమంది సాధికారత కోసం కృషిగా అభివర్ణిస్తున్నారు. అయితే ఈ రెండింటి మధ్య సన్ననిగీత ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ఫలితాలు ఏం చెబుతాయో చూడాలి.   

కాంగ్రెస్‌కు రవిరాజా షాక్ 

కాంగ్రెస్ సీనియర్ నేత రవిరాజా తన మద్దతుదారులతో కలిసి గురువారం బీజేపీలో చేరారు. డిప్యూటీ సీఎం దేవంద్ర ఫడ్నవీస్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో రవిరాజాను ముంబైలో బీజేపీ ఉపాధ్యక్షుడిగా పార్టీ నియమించింది. సియోన్ కోలివాడ స్థానంలో తనకు కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో రవిరాజా బీజేపీలో చేరినట్లు సమాచారం. రవిరాజా వైదొలగడం కాంగ్రెస్‌కు పెద్ద నష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు. ముంబై నగరంపై ప్రధానంగా దృష్టిసారించిన మహాయుతి కూటమికి రవిరాజా చేరిక పెద్ద బలమని చెబుతున్నారు.