calender_icon.png 16 April, 2025 | 8:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దంతవైద్యంపై పట్టింపేదీ?

15-04-2025 12:36:22 AM

  1. రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ డెంటల్ కాలేజీ ఉస్మానియా మాత్రమే
  2. మెడికల్ కాలేజీల్లో దంత విభాగాలు ఉన్నప్పటికీ నిష్ఫలమే
  3. ఆ విభాగాలను వేధిస్తున్న సిబ్బంది కొరత

హైదరాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా దంత వైద్యం నిర్లక్ష్యానికి గురవుతుందనే విమర్శలు దశాబ్దాల నుంచి వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 36 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో 33 కాలేజీల్లో డెంటల్ విభాగాలు ఉన్నప్పటికీ పోస్టుల నియామకం సరిగా లేకపోవడంతో డెంటల్ కోర్సు చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు.

తెలంగాణలో ఉస్మానియా డెంటల్ కళాశాల అతిపెద్ద కాలేజీ. 1979లో ఈ కాలేజీ ప్రారంభమైంది. ప్రస్తుతం కాలేజీలో యూజీ, పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కాలేజీ కాక సికింద్రాబాద్‌లో ఒక ఆర్మీ డెంటల్ కాలేజీ, ప్రైవేటు రంగంలో మరో 12 ప్రైవేటు డెంటల్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో యూజీ, పీజీ కోర్సులు ఉన్నాయి. అయినప్పటికీ.. ఇవి ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్యకు సరిసమానం కాదు.

దీన్నిబట్టి దంత వైద్యంపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలపై ఎంత పట్టింపు ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో చిన్న చిన్న పట్టణాల్లోనూ ప్రైవేటు డెంటల్ క్లినిక్స్ పుట్టుకొస్తున్నా.. సర్కార్ ప్రభుత్వ దంత వైద్య సదుపాయాలపై దృష్టి సారించకపోవడం గమ నార్హం. ఏటా జనాభా పెరుగుతూ, దంత సంబంధిత వ్యాధులతో సతమతమయ్యే వారి సంఖ్య పెరుగుతున్నా, ప్రభుత్వం దంత వైద్య సేవలను విస్తరించే ఆలోచన చేయడం లేదు.

ఉస్మానియా కాలేజీలో ప్రతిరోజూ సుమారు 1,200 ఓపీ నమోదవుతున్నది. ఇక్కడికి ఒక్క మన రాష్ట్రం నుంచే కాక పొరుగు రాష్ట్రలైన ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా రోగులు దంత సమస్యలతో చికిత్స కోసం వస్తారు. రాష్ట్ర నలుమూలల్లో దంత సమస్యలతో బాధపడేవారు ఇక్కడికి వచ్చి చికిత్స తీసుకోవడం సాధ్యమైన పనికాదు.

జిల్లాకేంద్రాల్లో ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ డెంటల్ విభాగాలు పెద్దగా వైద్యం సేవలు అందించడం లేదు. కొన్నిచోట్ల అసలు డెంటల్ విభాగమే ఉండడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దంత వైద్యంపై దృష్టి సారించి డెంటల్ కాలేజీల సంఖ్య పెంచితే బాగుంటుందని, తద్వారా రోగులకు మెరుగైన వైద్యసేవలు అందుతాయని ప్రజానీకం కోరుతున్నది.

ఉస్మానియా, గాంధీ, కాకతీయ దవాఖానల్లో మాత్రమే..

ప్రస్తుతం ఉస్మానియా డెంటల్ కళాశాల రాష్ట్రంలోనే పెద్దది. అలాగే గాంధీ, కాకతీయ ఆసుపత్రుల్లోనూ డెండల్ విభాగం అందుబాటులో ఉంది. డెంటల్ కాలేజీలో ఒక ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ట్యూటర్ అందుబాటులో ఉండి విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 33 డెంటల్ కళాశాలల్లో దంత వైద్య విభాగాలు ఉన్నప్పటికీ పోస్టుల భర్తీ అంశాన్ని మాత్రం సర్కార్ పట్టించుకోవడం లేదు.

కాంట్రాక్ట్ పద్ధతిలో కొందరిని భర్తీ చేసినా అక్కడ దంత వైద్యులు అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు ఉన్నాయి. అలాగే ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కాంట్రాక్టు పద్ధతిలో డెంటిస్ట్‌ల నియామకం జరిగింది. అక్కడ కూడా రోగులకు అంతంతమాత్రం వైద్యసేవలే అందుతున్నాయి. డెంటిస్ట్‌లు కనీసం వారానికి ఒక్కసారైనా విధులు నిర్వర్తించడం లేదనే ఆరోపణలున్నాయి.

ఇతర వ్యాధుల నిర్ధారణకూ..

మధుమేహం, కిడ్నీ, హెచ్‌ఐవీ/ఎయిడ్స్, ఆస్టియోపోరోసిస్, ఎనీమియా, ఓరల్ క్యాన్సర్ తదితర వ్యాధులను ఆరంభ దశలోనే గుర్తించడం తొలుత దంత వైద్యంతోనే సాధ్యం. దంత ఆరోగ్యం బాగుంటే దేహ ఆరోగ్యం సైతం బాగుంటుందని ప్రాథమికంగా వైద్యులు అంచనా వేస్తారు. అందు కే వారు ప్రతిఒక్కరూ ఆరు నెలలకోసారి డెం టల్ చెకప్ చేయించుకోవాలని సూచిస్తారు. దంత వైద్య నిపుణులు కేవలం దంతాల స్థితిగతులనే చూడటంతోనే ఆపరు. నోరు, పెదా లను సైతం పరిశీలిస్తారు. తద్వారా ఇతర వ్యాధుల ప్రాథమిక లక్షణాలను గుర్తిస్తారు.

వంద మందిలో 98 మందికి దంత సమస్యలు

వంద మందిలో 98 మందికి దంతవైద్య సమస్యలు ఉంటాయి. సాధారణంగా ఎవరూ దంత సమస్యలను పెద్దగా పట్టించుకోరు. ప్రభుత్వ అధీనంలో నడుస్తున్న డెంటల్ కాలేజీల్లో ఉస్మానియా కాలేజీ పెద్దది. దంత సమస్యలున్న వారు రాష్ట్రంలోని అన్ని జిల్లా ల నుంచి ఇక్కడికి రావడం కష్టతరమే.

గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్యను 36 వరకు తీసుకువచ్చాయి. కానీ.. డెంటల్ కాలేజీల గురిం చి మాత్రం సర్కార్ ఆలోచించడం లేదు. డెంటల్ డాక్టర్ల నియామకాలను ప్రభు త్వాలు అసలు పట్టించుకోవడం లేదు. 

 డాక్టర్ ఎండీ మంజూర్, 

ఆల్ ఇండియా డెంటల్ సర్జన్స్ 

అసోసియేషన్ అధ్యక్షుడు