- నగర శివారులో చెరువులు, నాలాల స్థలాల్లో నిర్మాణాలు
- రియల్టర్ల చేతిలో మోసపోతున్న ప్రజలు
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 20 (విజయక్రాంతి): రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర పరిధిని విస్తరిస్తూ ఆ పరిధిలోని ఆస్తులను సంరక్షిం చడం, విపత్తుల నుంచి నగరాన్ని కాపాడాలనే సంకల్పంతో సీఎం రేవంత్‌రెడ్డి చైర్మన్‌గా హైడ్రా ఆవిష్కృతం అయ్యింది. ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలను అందించాలనే లక్ష్యంతోనే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా)ను ఏర్పాటు చేస్తున్నామని సీఎం ప్రకటించారు.
అయితే హైదరాబాద్ నగరం విస్తరిస్తున్న క్రమంలో నగర శివారులో ఔటర్ రింగ్‌ను దాటి ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు వరకు రియల్ ఎస్టేట్ రంగం విస్తరించింది. అయితే కొంత మంది రియల్టర్లు చెరువులు, కుంటలను కలుపుకొని వెంచర్లు నిర్మించడంతో పాటు ప్లాట్లుగా మార్చి అమాయక ప్రజలకు కోట్లలో అమ్మేస్తున్నారు. ఇండ్లు నిర్మించుకున్న తర్వాత ఇండ్లలోకే నీరు వస్తుండటంతో ప్రజలు నిండా మునుగుతున్నారు. అలాగే చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలోని ప్లాట్లను పట్టా భూముల్లోని ప్లాట్లుగా చూపి ఫ్రీలాంచులలో అమ్మేసి, అనుమతుల దగ్గరకు వచ్చే సరికి బోర్డు తిప్పేస్తున్నారు.
ఇలాంటి ఘటనలు నగరంలో నిత్యకృత్యంగా మారాయి. ఈ ఘటనలు జరిగిన తర్వాత పోలీసులు కేసులు నమోదు చేయడం తప్పా, ఇప్పటి వరకు ఇలాంటి వాటిని నియంత్రించడంలో ప్రభుత్వ రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులతో పాటు రెరా, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ విభాగాల అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేయడంతో పాటు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్‌ను కమిషనర్‌గా నియమించారు. హైడ్రా రియల్ మోసాలతో పాటు చెరువులు, కుంటల ఆక్రమణలను నియంత్రిస్తుందా లేదా అనేది ఇప్పుడు నగరంలో చర్చనీయాంశంగా మారింది.
వివిద శాఖల సమన్వయంతో..
జీహెచ్‌ఎంసీతో పాటు, హెచ్‌ఎండీఏ, వాటర్ బోర్డు, విజిలెన్స్, ట్రాఫిక్, విద్యుత్తు, పోలీస్ విభాగాల సమన్వయంతో సమర్థవంతంగా పని చేయాలని హైడ్రా అధికారులకు సీఎం సూచించారు. అలాగే ప్రస్తుతం ఉన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగాన్ని పునర్ వ్యవస్థీకరించాలని, జీహెఎంసీతో పాటు హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు వరకు రెండు వేల కిలోమీటర్ల పరిధిలో హైడ్రా పని చేయాల్సి ఉంటుందని, పని విభజనకు వీలుగా సిటీలో ఇప్పుడున్న జోన్ల తరహాలో భౌగోళిక పరిధిని ప్రభుత్వం నిర్దేశించింది.
హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ పెరుగుతున్న నేపథ్యంలో ఎంతో విలువైన ప్రభుత్వ ఆస్తులను, విలువైన స్థలాలను రక్షించడంతోపాటు భూ ఆక్రమణలను నియంత్రించాలని ఇప్పటికే రంగనాథ్‌కు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే విపత్తుల నిర్వహణతో పాటు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట వేయడం, ఆక్రమణలను తొలిగించడం, అక్రమ నిర్మాణాలు, నిబంధనలను పాటించని ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, ప్రకటనల తొలిగింపు, ట్రాఫిక్ నిర్వహణ, తాగునీరు, విద్యుత్తు సరఫరాలో హైడ్రా కీలకం కానుంది.
సీఎం పర్యవేక్షణలోనే..
ముఖ్యమంత్రి చైర్మన్‌గా వ్యవహరించనున్న హైడ్రా కార్యకలాపాలు పూర్తిగా సీఎం పర్యవేక్షణలోనే జరుగనున్నాయి. గతంలో భూములు, చెరువులు, కుంటల పర్యవేక్షణ, ఆక్రమణల నియంత్రణ పూర్తిగా జిల్లా కలెక్టర్ల పరిధిలో ఉండేది. కలెక్టర్ల అధికారాలను హైడ్రా కమిషనర్‌కు బదలాయిస్తారా లేదా అనేది స్పష్టత లేదు. అలాగే హైడ్రా బృందంలో పురపాలక శాఖ మంత్రితో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల ఇన్‌చార్జి మంత్రులకు ప్రాతినిథ్యం కల్పించారు. నగరంతో పాటు నగర శివారులో జరిగే అనేక భూ కబ్జాల వెనుక, చెరువులు, కుంటల ఆక్రమణలు ఏదో ఒక పార్టీ నాయకుల ప్రమేయంతోనే జరుగుతున్నాయనేది నర్మగర్భం. అయితే రియల్ ఆక్రమణలు, మోసాలలో భాగస్వామ్యం ఉన్న రాజకీయ నాయకులు మంత్రులపై ఒత్తిడి తెస్తే హైడ్రా అధికారులు స్వేచ్ఛగా పని చేసే అవకాశం ఉండదని, దీంతో మోసాలు, ఆక్రమణలు మళ్లీ నిత్యకృత్యంగా మారుతాయనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నది. అయితే హైడ్రా కార్యకలాపాలలో రాజకీయ జోక్యం ఏ మేరకు ఉంటుందనేది సమీప భవిష్యత్తులోనే తేటతెల్లం కానుంది.
ఆక్రమణలకు అడ్డుకట్ట పడేనా?
అక్రమ నిర్మాణాలను నిరోధించే బాధ్యతను హైడ్రాకు అప్పగించారు. అలాగే పార్కులు, లే అవుట్లు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ ఆస్తులు రక్షించడం, బహిరంగ ప్రదేశాలు, ఆట స్థలాలు, చెరువులు, నాలాలు, రహదారులు ఆక్రమణలకు గురికాకుండా అడ్డుకోవడంతో పాటు కాజ్‌వేలు, ఫుట్‌పాత్, డ్రైనేజీలు, నాలాలు, రోడ్లను ఆక్రమిస్తే జీహెచ్‌ఎంసీ సమన్వయంతో ఆక్రమణలను తొలగించే బాధ్యత కూడా హైడ్రాదే. అలాగే హెచ్‌ఎండీఏ, నీటిపారుదల, రెవెన్యూ శాఖల ఆస్తుల పరిరక్షణ, భారత వాతావరణ శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ సహా మొదలైన సాంకేతిక సంస్థల సమన్వయంతో సకాలంలో ముందస్తు హెచ్చరికలు చేసి ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత హైడ్రాలోని ప్రత్యేక బృందాలకు అప్పగించనున్నారు.