మహారాష్ట్ర పీఠం ఎవరిని వరిస్తుందో?
రేసులో ఏక్‌నాథ్ షిండే కూడా.. కూటమి నేతల నిర్ణయమే ఫైనల్!
ముంబై, నవంబర్ ౨౩: మహారాష్ట్ర అసెంబ్లీ సంగ్రామంలో మహాయుతి (ఎన్డీఏ) ఘన విజయం సాధించింది. ఇక ఈ కూటమి తరఫున తదుపరి సీఎంగా ఎవరు పీఠం అధిష్టిస్తారు.. అనే చర్చ మొదలైంది. ఈ ఎన్నికల్లో ఏక్‌నాథ్ షిండే మహాయుతిని ముందుకు నడిపించారు. బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రిగా కొనసాగారు.
కానీ ఈ దఫా ఫడ్నవీస్‌కే సీఎం పగ్గాలు దక్కుతాయని జోరుగా చర్చ ఊపందుకుంది. ఇన్ని రోజులు ఓ లెక్క.. ఇప్పుడు మరోలెక్క అనే రీతిలో బీజేపీ తమ పార్టీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్‌ను సీఎం కుర్చీలో కూర్చోబెడుతుందని భావిస్తున్నారు. ఫడ్నవీస్ నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ (నైరుతి) స్థానం నుంచి రికార్డు మెజార్టీతో విజయం సాధించారు.
ఈ నేపథ్యంలో ఆయనకు సీఎం పదవి దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయని బీజేపీ కార్యకర్తలు అంటున్నారు. మహా బీజేపీ నేత ప్రవీణ్ ధరేకర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. అంతే కాకుం డా మహా బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్కులే ఫడ్నవీస్‌తో భేటీ కానున్నారు.
మహాయుతి గెలుపు కోసం ఫడ్నవీస్ అహోరాత్రులు శ్రమించాడని, సీఎం పదవికి ఆయన పూర్తిస్థాయిలో అర్హుడని ఫడ్నవీస్ తల్లి వ్యాఖ్యానించారు. మోదీ వెంటే మహారాష్ట్ర ఉంటుందని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. విపక్ష పార్టీలు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా.. చక్రవ్యూహాలు పన్నినా అవన్నీ నిలవలేదని తెలిపారు. అసలైన శివసేన ఏక్‌నాథ్ షిండే వర్గానిదే అని వెల్లడించారు.
మళ్లీ షిండేకు చాన్స్ ఉంటుందా?
ప్రస్తుతం మహాయుతిని ముందుండి నడిపిస్తున్న షిండేకు కూడా సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని చాలామంది అభిప్రాయపడుతున్నా రు. ఆయన సారథ్యంలోనే జరిగిన ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ మెజార్టీతో గెలుపొందింది. ఫడ్నవీస్ కూడా మీడియాతో మాట్లాడుతూ.. తదుపరి సీఎం విషయం గురించి మహాయుతి నేతలు కలిసి నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. దీంతో షిండేకు కూడా అవకాశాలు ఉంటాయనే చర్చకు బలం చేకూరింది.
అజిత్ పవార్ స్థానమేంటి?
ఎన్సీపీ నుంచి కొంత మంది ఎమ్మెల్యేలతో క లిసి మహాయుతిలో చేరిన అజిత్ పవార్‌కు సీఎం అయ్యే అవకాశాలు తక్కువేనని చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం బీజేపీకి చెందిన ఫడ్నవీస్, శివ సేనకు చెందిన షిండే మధ్యే పోటీ నెలకొని ఉంది.
ముంబైకి పరిశీలకులు
బీజేపీకి చెందిన ఎన్నికల పరిశీలకులు ఆదివారం ముంబైకి రానున్నట్లు తెలుస్తోంది. వారు వచ్చి తదుపరి సీఎం ఎవరనే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 26తో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనుంది. సీఎం ఎవరనేది మహాయుతి కూటమి త్వరగా ప్రకటించాల్సి ఉంటుంది.
కూటమిలో సందిగ్ధం
288 సీట్లున్న మహారాష్ట్రలో అధికారం కోసం 145 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. కానీ బీజేపీ సొంతంగా 133 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఆ పార్టీ అధికారం చేజిక్కించుకోవడానికి శివసేన (షిండే వర్గం) లేదా ఎన్సీపీ (అజిత్ పవార్) వర్గంతోనైనా జట్టు కట్టాల్సి ఉంటుంది. 2019లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు శివసేన నుంచి బయటకు వచ్చిన షిండేతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎం పదవిని కూడా షిండేకు వదులుకుంది.