calender_icon.png 23 October, 2024 | 10:08 AM

సీఎం రేవంత్‌కు సాగునీటి ప్రాజెక్టుపై ప్రేమలేదా?

15-09-2024 01:53:53 AM

మాజీ మంత్రి కేటీఆర్ విసుర్లు

నాగర్ కర్నూల్, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): పాలమూరు ముద్దుబిడ్డనని చెప్పుకునే సీఎం రేవంత్‌రెడ్డికి పాలమూరు రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుపై ప్రేమ లేదా? అని మాజీ మంత్రి కేటీఆర్  ప్రశ్నించారు. తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలోని మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఇంటికి శనివారం ఆయన చేరుకున్నారు. లక్ష్మారెడ్డిని పరామర్శించి అనంతరం ఆయన భార్య శ్వేత చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారికి ప్రాజెక్టులు కట్టబెడుతున్నారంటూ గగ్గోలు పెట్టిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కాంట్రాక్టును ఎవరికి అప్పగించారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. 

కరువు నేలను కల్పతరువుగా మార్చేందుకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని, ప్రాజెక్ట్ పరిధిలో దాదాపు 95 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. కేవలం 5 శాతం పనులు మాత్రమే మిగిలి ఉండగా, అవి పూర్తి చేసేందుకు కూడా రాష్ట్రప్రభుత్వం అష్టకష్టాలు పడుతోందని మండిపడ్డారు. ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే ప్రజలకు కేసీఆర్ గుర్తుసుకొస్తారన్న అక్కసుతోనే ప్రాజెక్టును పూర్తి చేయడం లేదన్నారు.

కాంట్రాక్టుల్లో కమిషన్ల కోసమే సీఎం ఆంధ్రా కాంట్రాక్టర్లకు పనులు అప్పజెప్పారని, గతంలో గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను మెఘాతో పాటు మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డికి సంబంధించి కాంట్రాక్ట్ ఏజెన్సీకి పనులు అప్పిగించారని మండిపడ్డారు. త్వరలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పాలమూరు  ప్రాజెక్టు పర్యటన షురూ చేస్తామన్నారు. మాజీ మంత్రి వెంట ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఉన్నారు.