03-04-2025 02:51:51 PM
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య(Doddi Komaraiah) చూపిన స్ఫూర్తి నేటి తరాలకు ఆదర్శమని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్(Collector Jitesh V Patil) తెలిపారు. గురువారం ఐడిఓసి కార్యాలయవు సమావేశపు హాలులో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దొడ్డి కొమురయ్య జయంతి వేడుకల్లో అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ తో కలిసి దొడ్డి కొమురయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దొడ్డి కొమరయ్య స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తలచుకోగానే మొదటగా గుర్తుకు వచ్చేది పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య అని చెప్పారు. దొడ్డి కొమురయ్య 1927లో ఉమ్మడి వరంగల్ జిల్లా కడివెండి గ్రామంలో గొర్రె కాపరుల కుటుంబంలో జన్మించారని చెప్పారు. దొడ్డి కొమురయ్య ఒక మహోన్నత ఉద్యమానికి ఆద్యుడవడం తెలంగాణ ప్రజలకు గర్వకారణం అన్నారు.
దొడ్డి కొమురయ్య అమరత్వం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి ప్రతీక అని, భూమి, భుక్తి, విముక్తి పోరాట ఉద్యమంగా మారడానికి కొమురయ్య ప్రధాన కారణమని చెప్పారు. దొడ్డి కొమురయ్య సాయుధ పోరాటంలో చూపిన స్ఫూర్తిని కలెక్టర్ కొనియాడారు. తెలంగాణ ప్రజల కొరకు మహనీయుల చేసిన త్యాగాలు నేటి తరానికి తెలియచేసేందుకు ప్రభుత్వం ఆయన జయంతి, వర్థంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దొడ్డి కొమురయ్య స్ఫూర్తి ప్రతి ఒక్కరికి తెలియాలని, మహనీయుల వర్ధంతి, జయంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వారి స్పూర్తిని మనమంతా కొనసాగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి ఇందిరా, కలెక్టరేట్ ఏవో రమాదేవి మరియు అన్ని శాఖల జిల్లా అధికారులు, బిసి సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.