calender_icon.png 24 October, 2024 | 5:47 PM

రాజమౌళిపై డాక్యుమెంటరీ

07-07-2024 12:05:00 AM

ఎస్‌ఎస్ రాజమౌళి.. ఈ పేరు చెప్పగానే దర్శక ధీరుడు అన్న పదాన్ని అప్రయత్నంగానే మన పెదవులు పలికేస్తాయి. ఇప్పటివరకు ఆయన తీసిన సినిమాలే చూశాం.. ఇక ఆయన గురించి తీసిన సినిమాను చూడబోతున్నాం. ఔను, ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి పాన్ ఇండియా చిత్రాలతో ప్రపంచాన్ని ఆకర్షించిన రాజమౌళిపై ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. దీని స్ట్రీమింగ్ తేదీని, అందులో ఏం చూపబోతున్నారో వెల్లడిస్తూ ఆ సంస్థ తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను సైతం విడుదల చేసింది. ఒక మనిషి.. అనేక బ్లాక్‌బస్టర్లు.. అంతులేని ఆశయం.

ఈ లెజెండరీ దర్శకుడు ఇంత గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డారు? ఎన్ని సంవత్సరాలు పట్టింది? వంటి ఆంశాలతో రూపొందిన ఈ డాక్యుమెంటరీకి ‘మోడ్రన్ మాస్టర్స్’ అని నామకరణం చేసింది. ఆగస్టు 2 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రసారం కానున్న ఈ డాక్యుమెంటరీలో పలువురు హాలీవుడ్ దర్శకులు, సినీ ప్రముఖులు రాజమౌళిపై వారి అభిప్రాయాలను తెలియజేయనున్నారు.  ఈ దర్శక ధీరుడితో ఉన్న అనుబంధాన్ని టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా పంచుకోనున్నట్టు తెలుస్తోంది. రాజమౌళి ప్రస్తుతం మహేశ్‌బాబుతో కలిసి చేస్తున్న ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు.