calender_icon.png 16 October, 2024 | 6:50 PM

వైద్యులు, సిబ్బంది రోగులతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

16-10-2024 04:46:25 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): వివిధ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రులకు వచ్చే రోగుల పట్ల వైద్యులు సిబ్బంది బాధ్యతయుతంగా వ్యవహరించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు అన్నారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ యూనిట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పది బెడ్లతో కొత్తగూడెంలో ఉన్న రోగుల సంఖ్యకు అనుగుణంగా మిషన్లు అందుబాటులో లేకపోవడంతో అత్యవసర డయాలసిస్ రోగులు ఇల్లందు భద్రాచలంతో పాటు ఇతర ప్రాంతాలకు వెళుతూ ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతున్నారని అన్నారు.

ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి పెద్ద మొత్తంలో నష్టపోతున్నారని వారిని దృష్టిలో ఉంచుకొని రూ. నలభై లక్షల వ్యయంతో పాల్వంచలో నూతన యూనిట్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రూ 79 లక్షలతో త్వరలో ప్రభుత్వ ఆసుపత్రి ఆధునీకరణ పనులు కోసం ప్రతిపాదనలు పంపగా, పరిపాలన అనుమతులు లభించాయన్నారు. త్వరలో పనులను ప్రారంభించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ తాసిల్దార్ వివేక్, మున్సిపల్ కమిషనర్ డాకూ నాయక్, ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి, డిసిహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు, ఇన్చార్జ్ డిఎం అండ్ హెచ్వో డాక్టర్స్ , డిసిఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే షాబీర్ భాష తదితరులు పాల్గొన్నారు.