10-04-2025 01:44:57 AM
ఐటీడీఏ పీవో రాహుల్
బూర్గంపాడు/అశ్వాపురం,ఏప్రిల్ 9(విజయక్రాంతి): గిరిజన రోగుల పట్ల డాక్టర్లు,సిబ్బంది మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని, వడదెబ్బ తగలకుండా వేసవికాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై వారికి అవగాహన కల్పించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ అన్నారు. బుధవారం మణుగూరు లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని, అశ్వాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ప్రతి వార్డును పరిశీలించి, గిరిజనులకు అందిస్తున్న వైద్య సౌకర్యాల గురించి మెడికల్ ఆఫీసర్లను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుమూల ప్రాంత ఆదివాసి గిరిజన గ్రామాల నుండి వచ్చే వారికి సరైన వైద్యం చేసి మందులు అందజేయాలని సూచించారు.
ముఖ్యంగా గర్భిణీ స్త్రీల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డాక్టర్లు వైద్య సిబ్బంది సమయపాలన పాటించి విధులు నిర్వహించాలన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ శాతం ఆసుపత్రిలో వడదెబ్బకు సంబంధించిన మందులు, ఓఆర్‌ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అనంతరం వివిధ వార్డులలో చికిత్స పొందుతున్న రోగులను ఆసుపత్రిలో వైద్య సేవలు సక్రమంగా అందుతున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు. అనంతరం అశ్వాపురం,మణుగూరు లోని తహశీల్దార్ కార్యాలయం ఎంపీడీవో కార్యాలయాలను తనిఖీ చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం హెల్ప్ డెస్క్ రికార్డులను పరిశీలించి నిరుద్యోగులైన గిరిజన యువకులు రాజీవ్ యువ వికాస పథకం కొరకు దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే యువకులకు సలహాలు సూచనలు ఇచ్చి తప్పులు లేకుండా దరఖాస్తులు పూర్తి చేసి తప్పనిసరిగా ఆన్లైన్లో చేయించాలన్నారు.
రాజీవ్ వికాస పథకానికి దరఖాస్తులు దాఖలు చేసే చివరి తేదీ ఈ నెల 14 వరకు ఉన్నందున ఎక్కువ శాతం నిరుద్యోగ యువకులు దరఖాస్తు చేసుకునే విధంగా సంబంధిత మున్సిపల్ సిబ్బంది ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది విరివిగా ప్రచారం చేసి ఎక్కువ శాతం యువకులు దరఖాస్తు చేసుకునేలా చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో అశ్వాపురం తహశీల్దార్ స్వర్ణ, ఎంపీఓ ముత్యాలరావు, మణుగూరు తహశీల్దార్ రాఘవరెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఏ డి ఎం హెచ్ ఓ డాక్టర్ చైతన్య మరియు డాక్టర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.