calender_icon.png 24 September, 2024 | 2:08 PM

పంటలు ఎండినాక నీళ్లు ఇస్తారా?

24-09-2024 01:31:28 AM

  1. అధికారులపై మంత్రి తుమ్మల ఆగ్రహం 
  2. పాలేరు సాగర్ కాల్వ పునరుద్ధరణ పనుల పరిశీలన

ఖమ్మం, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): పంటలు ఎండిపోయాక నీళ్లు ఇస్తారా అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులపై మండిపడ్డారు. సోమవా రం కూసుమంచి మండలం పాలేరు ఎడమ కాల్వకు పడిన గండిని పరిశీలించారు. 2.50 లక్షల ఎకరాలు నీళ్లు లేక ఎండిపోతున్నా ఇప్పటి వరకు సాగర్ కాల్వకు పడిన గండిని పూడ్చలేదంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేసి, కాల్వకు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని ఆదేశించారు. ఈ కాల్వ మీద ఆధారపడి ఐదు నియోజవకర్గాల రైతులు ఉన్నారని, కాల్వకు గండి పడి 20 రోజులు దాటినా ఎందుకు పూడ్చలేదని ప్రశ్నించారు. తనకు నివేదిక ఇవ్వాలని అక్కడే ఉన్న కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్‌ను ఆదేశించారు. అక్కడి నుంచే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాతో ఫోన్‌లో మాట్లాడారు. సాగునీరందక రైతులు పడుతున్న అవస్థలను వారి దృష్టికి తీసుకెళ్లారు. 

పనులను తనిఖీ చేసిన పొంగులేటి 

పాలేరు ఎడమ కాల్వ పునరుద్ధరణ పనులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆశించిన మేర పనులు జరగకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు చేసే ప్రాంతంలో లైటింగ్  సరిపడేంత లేకపోవడంతో లైట్లు ఏర్పాటు చేశారు. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.