రేవంత్ సర్కార్‌కు తిరుగుబాటు తప్పదు
మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): ప్రస్తుతం ఉన్న పథకాలకు వచ్చే డబ్బును పెంచడంతో పాటు కొత్తగా మరిన్ని పథకాలు అమలు చేస్తామని దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ ఉన్న లబ్ధిదారుల నుంచి సొమ్మును వెనక్కు రాబట్టే వింత చేష్టలు చేస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. శనివారం ‘ఎక్స్’ వేదికగా కేటీఆర్ స్పందిస్తూ.. సాంకేతిక కారణాలు చూపిస్తూ వేలాదిమంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఇదివరకు అందించిన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వానికి వాపసు ఇవ్వాలంటూ రేవంత్ సర్కార్ నోటీసులు పంపిస్తోందన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలకి గత ఐదేళ్లుగా ఆసరా పెన్షన్ కింద వచ్చిన రూ.లక్షా 72వేల రూపాయలు తిరిగి కట్టాలని నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు. ఒంటరి మహిళగా ఆపై పక్షవాతంతో బాధపడుతూ ఉన్న మల్లమ్మ నుంచి ఆసరా పెన్షన్ సొమ్మును తిరిగి లాక్కోవడానికి ప్రయత్నించడం సరైన పద్ధతి కాదన్నారు. పేదలపై ఇలాంటి కక్షసాధింపు చర్యలు మానుకోవాలని.. లేకుంటే ప్రజలే కాంగ్రెస్ సర్కార్ మీద తిరుగుబాటు చేస్తారని పేర్కొన్నారు.