02-03-2025 01:09:52 AM
* ‘విజయక్రాంతి’ ప్రత్యేక ఇంటర్య్వూ
సుమారు ఏడున్నర దశాబ్దాల భారతదేశ స్వాతంత్య్రానంతర చరిత్రలో సనాతన ధర్మానికి మళ్లీ మంచిరోజులు వచ్చాయని, ప్రధాని మోదీ పాలనా విధానాలు ఒకింత సంతృప్తికరంగానే ఉన్నాయని గుజరాత్‌లోని ద్వారక శారదా పీఠం జగద్గురు శ్రీశ్రీశ్రీ శంకరాచార్య స్వామి సదానంద్ సరస్వతీజీ అన్నారు.
శనివారం ఉదయం హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని ‘విజయక్రాంతి’ దినపత్రిక చైర్మన్ సీహెచ్ లక్ష్మీరాజం స్వగృహంలో ఏర్పాటైన ప్రత్యేక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారత్ హిందూ ధార్మికదేశంగా మారాల్సిందే కానీ, దానికి తగిన సైద్ధాంతిక ప్రాతిపదిక అవసరమని, దానికంటే ముందు దేశప్రజలు, నాయకులలో ఆ మేరకు చిత్తశుద్ధి, మానసిక సంసిద్ధత నెలకొనాలని తెలిపారు.
పత్రిక బృందం అడిగిన పలు ప్రశ్నలకు సమాధానంగా ఆయన పై అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. స్వామీజీ ఇంటర్వ్యూలోని ప్రధానాంశాలు యథాతథంగా..
హైదరాబాద్, మార్చి ౧ (విజయక్రాంతి) :
సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలని అందరూ అంటుంటారు. జ్ఞానుల విషయమలా ఉంచి, ప్రత్యేకించి సామాన్యులు దీనిని ఏ రకంగా పాటించాలి? ప్రజలు ధర్మబద్ధమైన జీవితం గడపడమెలాగో ఒకటి రెండు మాటల్లో చెప్పండి..
మనసుంటే మార్గం ఉండకపోదు. ధర్మబద్ధంగా జీవిద్దామనుకునే సగటు మానవుల కోసం చిన్నచిన్న విధులు అనేకం ఉన్నాయి. కలియుగంలో కొద్దిమేర ధర్మాన్ని పాటించినా ఎంతో పుణ్యం లభిస్తుందని వేద శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదా॥ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి ధర్మకార్యం.
ఇంతేకాదు, నదులను కాపాడుకోవడం, వృక్షాలను పెంచడం, మహానుభావులను ఆరాధించడం వంటి కార్యాలు అనేకం ఉన్నాయి. యజ్ఞాలు చేయడమూ ఎంతో పెద్ద ధర్మకార్యం. ఈ రకంగా నిజ జీవితంలో ప్రతీ ఒక్కరూ ధర్మబద్ధంగా జీవించవచ్చు.
పరంపరగా జరగాల్సిన పనులు
“ఇటీవల ప్రయాగ్‌రాజ్‌లో ముగిసిన మహాకుంభమేళా సందర్భంగా గంగానది స్నానం చేయడ మూ ఒక ధర్మకార్యంగానే ప్రజలు భావించారు. అప్పుడే నదీ తీరంలో స్నానమాచరించి వస్తున్న ఒక వృద్ధ మహిళ అక్కడే ఉన్న మమ్మల్ని చూసి ఆగి, వెంటనే మాకు ప్రణామం చేసింది.
‘నదీస్నానంతోపాటు సాధుపుంగవుని దర్శనం కూడా లభించినందుకు తానెంతో సంతోష పడుతున్నట్టు’ ఆమె చెప్పింది.
‘ఎక్కడికి వెళ్లి వస్తున్నావమ్మా’ అని నేను ఆమెను అడిగితే,
‘గంగాస్నానం చేసి వస్తున్నాను స్వామీ..’ అంది.
‘గంగాస్నానం ఎందుకు చేశావు..’ అని అడిగాను మళ్లీ.
‘నాకు తెలియదు. కానీ, నా బాల్యంలో నన్ను మా అమ్మమ్మ ఇక్కడికి తీసుకొచ్చి గంగాస్నానం చేయించింది. అందుకే, నేను వచ్చాను. ఇప్పుడు వెంట నా మనవరాలిని కూడా తెచ్చాను. అంతే స్వామీ...’ అంది.
ఇదీ మన పరంపర. సాధనా సంపత్తి లేని సాధారణ జనాలకు ఆధ్యాత్మిక సంస్కృతి, వారసత్వాలు ఈ రకంగా అలవడుతాయి. మన పూర్వీకులు, వంశీకులు ఏ ధర్మ కార్యాలైతే చేశారో వాటిని ఆచరించడంలో ధర్మం నెలకొని ఉంది.
ఉన్నవాళ్లు లేనివాళ్లకు సహాయపడాలి
నిజంగా ధర్మబద్ధమైన జీవితం గడపాలనుకొనే వారికి చేయడానికి ఎన్నో పుణ్యకార్యాలు వేచి ఉంటాయి. అతిథి, అభ్యాగతులకు భోజనం పెట్టడం నుంచి దాహం గొన్నవారికి తాగునీరు ఇవ్వడం వరకూ.. అనేకం. ముఖ్యంగా ఉన్నవాళ్లు లేనివాళ్లకు సహాయం చేయడం గొప్ప కార్యం. మన ఆదాయ, సంపాదనలలో ఎంతో కొంత పేదవారికి అందించడం ద్వారా సేవ చేయవచ్చు.
ఇంకా పలు రకాల మంచి పనులు చేయవచ్చు. ఉదా॥కు మీ అమ్మాయి వివా హం కోటి రూపాయలతో చేయాలనుకుంటారు. దానికిగాను కోటి 10 లక్షలకు అంచనా వేసుకుంటారు. గట్టి సంకల్పంతో ఎక్కడో చోట పొదుపు చేయడం ద్వారా కోటి రూపాయలకే ఖర్చులను కుదింపచేసుకుని, మిగిలిన రూ.10 లక్షలతో ధర్మకార్యాలు చేయవచ్చు.
ఆ డబ్బుతో నిరుపేదల బిడ్డలు ఒక్కొక్కరికి లక్ష చొప్పున ఖర్చు చేసి, పదిమంది పెళ్ళిళ్లు జరుపవచ్చు. ఈ రకంగా ప్రతి ఒక్కరూ తమ స్థాయిలలో పొరుగు వారికి సాయ పడాలనే సంకల్పం అలవర్చుకోవాలి. ఒక దుప్పటి కొనుక్కోవాలనుకొని మార్కెట్‌కు వెళతారు. అవి రకరకాల ధరల్లో అందుబాటులో ఉంటాయి. లక్ష రూపాయల నుంచి ఎన్ని లక్షల వరకైనా వెచ్చించి కొనుక్కోవచ్చు.
పిల్లల స్కూలు, కాలేజీల ఫీజులు కూడా లక్షల్లో ఉం టాయి. బలమైన సంకల్పంతో ఎక్క డ వీలైతే అక్కడ, ఎంత వీలైతే అంత పొదుపు చేయడం ద్వారా మిగిలిన కొద్దిపాటి సొమ్ముతో అయినా సామాన్యులకు సహాయపడవచ్చు. ఇలాంటి పనులు అడుగడుగునా అనేకం వుంటాయి. మనకు ఉండాల్సిందల్లా సత్సంకల్పం. ఈ రకంగా ఎవరికి వాళ్లు.. వాళ్ల పరిధిలో ధర్మబద్ధంగా జీవించే అవకాశం ఉంటుంది.
ఏకతాటిపైకి ఎందుకు రావడం లేదు?
దేశంలో అత్యధిక సంఖ్యలో హిందువులే ఉన్నారు. నలుగురు శంకరాచార్యులు, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ తదితర వర్గాల వారంతా సనాతన ధర్మపాలన రావాలనే మాట్లాడుతున్నారు. సామాన్యులకు అర్థం కాని విషయమేమి టంటే, అయిదేళ్లు, పదేళ్లు గడుస్తున్నా వారంతా ఎందుకు ఒక్క తాటిపైకి రావడం లేదు?
దేనికైనా సమయం రావాలి. సూత్రపరంగా, సిద్ధాంత పరంగా అందరూ ఒక్కటే. రాజకీయ పార్టీల వారి విషయమెలా ఉన్నా శంకరాచార్యులుగా మేమంతా ధర్మపా లన శాస్త్రోక్తంగా, వేదోక్తంగా జరగాలని కోరుకుంటున్నాం. ధర్మబద్ధమైన పాలన దేశంలో రావాలి. అయితే, అది ఏ రకంగా ఉండాలి? దాని స్వరూప స్వభావాలు ఎలాంటివి? అన్న వి ప్రధానం. హిందువుల్లోనూ అసలైన వారు, నకిలీలూ ఉంటున్నారు.
ధర్మం పేరుతో జరిగే అధర్మాలనూ మనం గమనంలోకి తీసుకోవాలి. కొన్ని రకాల పనులు చూడడానికి ధర్మబద్ధంగానే కనిపిస్తాయి. నాయకులలోనూ రకరకాల వాళ్లు ఉంటారు. అందరూ చెడ్డవారు ఉండరు. కొందరు మంచి నాయకులూ ఉం టారు. ఎవరైతే రాజ్యపాలన చేస్తారో వారంతా రాజనీతి ఆధారం గానే ధర్మపాలనను అమలు చేస్తారు.
వాళ్ల సతీమణులు మాత్రం తమ తమ ఇండ్లలో పూర్తి ధర్మబద్ధం గానే జీవిస్తారు. ఇంకా కొందరు నాయకులు అబద్ధాలు ఆడతుంటారు. హామీలు ఇచ్చి తప్పుతారు. ఇదంతా అధర్మమే కదా! అందుకే, నేతల్లో నీతి తప్పనిసరిగా ఉండాలి. వాళ్లలో ధార్మికత పట్ల చిత్తశుద్ధి అవసరం. ప్రజలను సన్మార్గంలోకి తీసుకెళ్లగలగాలి.
‘హిందూదేశం’ కావాలా? ఎలా?
ముస్లింల జనాభా అధికంగా ఉన్న ప్రపంచంలోని కొన్ని దేశాలలో వారివైన ఆధ్యాత్మిక ధార్మిక పాలనలు అమలులో ఉన్నాయి. ఇదే రకంగా చూసినప్పుడు మన భారతదేశంలో 80 శాతం మంది ప్రజలు హిందువులుగా ఉన్నారు. అలాంటప్పుడు ఇదీ ‘హిందూదేశం’గా మారవలసిన అవసరం ఉందని కొం దరు అభిప్రాయపడు తున్నారు. మీ ఉద్దేశ్యం ప్రకారం దేశం అలా మారవలసిన అవసరం ఉందా? లేదా? ఒకవేళ మారాలనుకుంటే, నలుగురు శంకరాచార్యుల వైఖరి ఎలా ఉం టుంది? ఎలా ఉంటే బావుంటుంది?
భారతదేశాన్ని ‘హిందూదేశం’గా మార్చాలన్న కోర్కె సరే. అంతకంటే ముందు, ‘హిందూదేశం’ ఏర్పడడం అన్నది ఏ సిద్ధాంతాల ఆధారంగా జరగాలన్నది ఇక్కడ ము ఖ్యం. ముందు ఈ నిర్ణయం జరగాలి. అలా ఏర్పడబోయే హిందూదేశంలో సనాతన ధర్మ సిద్ధాంతాల మేరకే పాలన జరుగుతుందా లేదా? అది ఒక ధార్మిక, ప్రాచీన పరంపరకు అనుగుణంగానే ఉంటుందా? దేశమాతగా గోమాత ఉంటుందా లేదా? ఊరికే ఏదో ‘హిందూదేశం’ అని పేరొకటి పెట్టుకుంటే సరిపోదు.
అందులో ఉండబోయే సూత్రం (ఫార్ములా) ఏమిటి? అపుడు ఏ నియమాలు అమలులో ఉంటాయి? ఈ ప్రశ్నలన్నీ ఈ సందర్భంగా వస్తాయి. ఎందుకంటే, భారతదే శానికి ఒక రాజ్యాంగం అంటూ ఉంది. దీని ప్రకారం మన దేశంలో అందరికీ జీవించడానికి అనుమతి ఉంది.
ప్రజలు, పాలకుల్లో ఆ నిబద్ధత ఏది?
ఆనాడు జిన్నా పాకిస్థాన్‌ను ఏర్పరచుకున్నారు. కానీ, హిందుస్థాన్‌ను మాత్రం హిం దూదేశంగా ఉండనీయలేదు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడెలా హిందూదేశాన్ని సాధిం చగలం? ఇతర ధర్మాల వారు మన ధర్మాన్ని అంగీకరించరు. ఇంకా కొందరు ఈ దేశాన్ని తమ దేశంగానే ఒప్పు కోవడం లేదు. భారతదేశాన్ని ‘భారతమాత’ అనడానికే వ్యతిరేకిస్తున్నారు.
వందేమాతర గీతం ఆలపించడానికి సంకోచిస్తున్నారు. స్వాతంత్య్రం తర్వాత మన దేశానికి ఒక రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నాం. ఇవన్నీ రూపొందిన తర్వాత కొందరు ఈ దేశంలో ఉంటూ, దేశద్రోహుల సిద్ధాంతాన్ని ముందు కు తీసుకెళుతున్నారు. ఈ అన్నింటి గురించి విచారించుకున్న తర్వాత హిందూదేశం ప్రతిపాదన గురించి ఆలోచిస్తే బావుంటుంది.
ప్రతిపాదన మంచిదే కావచ్చు. అయితే, ఇక్కడ విష యం సిద్ధాంత పరమైంది. సనాతన ధార్మిక సిద్ధాంతం ప్రకారం జీవిద్దామని కోరుకునే వారు దేశంలో ఎందరున్నారు? ఈ మేర కు రాజ్యపాలన చేసేవాళ్లు ఎందరు? జనాభా సంఖ్యపరంగా ‘హిందూదేశం’ అని పిలుచుకోగలమేమో.
కానీ, మన హిందువుల్లోనే పూర్తి సైద్ధాంతిక పరమైన జీవన విధానాన్ని పాటించాలనుకొనేవారు, పాలన చేయాలనే నిబద్ధతగల నాయకులు ఎందరున్నారు? ఎందరు పూర్తి ధార్మిక బద్ధమైన రాజ్యాంగ పాలన చేయగలరు? ఎంతమంది వేదోక్తమైన, శాస్త్రోక్తమైన జీవనానికి సిద్ధంగా ఉన్నారు? ఈ విషయాలపట్ల ప్రజలు, నాయకులలో కావలసిన మేర చైతన్యం రావాలి. అప్పుడేపై ప్రతిపాదన గురించి ఆలోచించాలి.
ఈ మేరకు మన ప్రజలలో, రాజ్యాంగ పరంగానూ ఎప్పు డు పరివర్తన వస్తుందో అప్పుడు మాత్రమే దీనికొక ఆశావహ దృక్పథం ఏర్పడుతుంది.సనాతన ధర్మపరులుగా భారతదేశం హిందూదేశం కావడాన్ని మేం స్వాగతిస్తాం. కాకపోతే, అంతటి ధైర్యాన్ని ప్రదర్శించగల రాజకీయ పార్టీ ఏది అన్నదీ ప్రశ్న.
మనకు ధర్మబద్ధమైన పాలన కావాలి, రావాలి. స్వాతంత్య్ర సాధన సమయంలో అప్పటికి ఇప్పటికి దేశంలోని ప్రజల పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. రాబోయే యాభై ఏళ్లలో ఇంకా ఏ రకమైన పరిస్థితి ఉండనుందో తెలియదు.